న్యూట్రీషియన్ అపాయింట్ కోసం సెలెబ్రెటీల క్యూ…

శ్వేతా షా…డైటీషియన్‌. ముంబయికి చెందిన ఈమె తొమ్మిదో తరగతిలో తన తల్లితో కలిసి వారంపాటు ఒక ఆశ్రమానికి వెళ్లింది. అక్కడ శరీరంపై ఆహార ప్రభావాన్ని అర్థం చేసుకుంది. అక్కడి సూచనలతో తన తల్లి ఆర్థరైటిస్‌ను, తండ్రి డయాబెటీస్‌ను తగ్గించుకోగలిగారు. దీంతో తన తల్లి కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడటంతోపాటు కెరీర్‌నూ మలుచుకోవచ్చన్న సలహాతో డైటెటిక్స్‌ అండ్‌ అప్లయిడ్‌ న్యూట్రిషన్‌లో పీజీ చేసింది. మొదట ఫుల్‌టైం ఉద్యోగిగా ఉన్నా, పిల్లలు పుట్టాక ఫ్రీలాన్సింగ్‌ చేసి, మంచి పేరు సాధించింది. 2014లో తన తమ్ముడితో కలిసి ఈట్‌ఫిట్‌ 24/7 పేరిట మొబైల్‌ అప్లికేషన్‌ తయారు చేసింది. 600 రకాల ప్రత్యేకమైన వంటకాలు దీనిలో ఉంటాయి. అలాగే వర్చువల్‌గా తన క్లయింట్ల అవసరాలకు తగ్గట్టుగా డైట్‌ ప్లాన్‌ రూపొందించేది. ఆపై ఫిట్జా, న్యూట్రోలైఫ్‌ అనే రెండు వెల్‌నెస్‌ బ్రాండ్‌లనూ ఏర్పాటు చేసింది.ఆయుర్వేద, సాత్విక ఆహారానికి ప్రాముఖ్యమిస్తుంది. ఇందులో ఫైబర్‌ ఎక్కువ, కొవ్వు తక్కువగా ఉంటుంది.

Final Client profile eatfit 1024x1536 1

తన క్లయింట్‌ సంస్కృతి, రోజువారీ అలవాట్లు, తినే ఆహారం, పనితీరు, జెనెటిక్‌ డిజార్డర్లు, సరిపడని పదార్థాలు, వారి లక్ష్యం ఆధారంగా ఆహారం, నీటిని ప్లాన్‌ చేస్తుంది. నచ్చిన ఆహారాన్ని అసలు కట్టడి చేయకుండా వాటితోనే ఆరోగ్యకరమైన డైట్‌ ప్లాన్‌ రూపొందిస్తుంది. వారి ప్రయాణాలు, పెళ్లి, పార్టీలు, ఫంక్షన్లు ఇలా వేటికి వెళ్లినా వాటి ఆధారంగా డిటాక్స్‌ అందిస్తుంది. మొత్తంగా తన క్లయింట్‌ ఏం తినాలనుకున్నా నిరభ్యంతరంగా తినమంటుంది. కానీ ఎంత మొతంలో అనేది మాత్రం తను నిర్ణయిస్తుంది. అలాగే వారు కోరుకున్న విధంగా కనిపించేలానూ చేస్తుంది. అందుకే సెలబ్రిటీల ఎంపిక తను అవుతోంది. దీపికా పదుకొణె తన పెళ్లిలో, కేన్స్‌ సినిమా వేడుకల్లో అందంగా, ఆకర్షణీయంగా కనిపించడంలో ఈమె సాయం కోరింది. హర్భజన్‌, అతని భార్య గీతాబస్రా తన ఫిట్‌నెస్‌లో భాగంగా ఈమెనే ఎంచుకున్నాడు. సాక్షి ధోనీ ప్రసవం తర్వాత తిరిగి పాత రూపంలోకి రావడంలోనూ ఈమెదే పాత్ర.