ఐపీఎల్ ప్రారంభం నుంచి చెన్నై సూపర్ కింగ్స్‌కు సారథ్యం వహిస్తున్న మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ తర్వాత చెన్నై సారథిగా ఆ యువ ఆటగాడికే అవకాశం దక్కే చాన్స్‌లు ఎక్కువ కనిపిస్తున్నాయి.
ప్రపంచానికి పొట్టి క్రికెట్ పరిచయమైన తొలినాళ్లలోనే.. మహేంద్రసింగ్ ధోనీ తన నాయకత్వ సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. తొలిసారి నిర్వహించిన టీ20 ప్రపంచకప్‌లో యువ ఆటగాళ్లతో కూడిన జట్టుకు సారథ్యం వహించిన ఈ జార్ఖండ్ డైనమైట్.. టీమిండియాను ప్రపంచ చాంపియన్‌గా నిలిపాడు. దీంతో ఒక్కసారిగా దేశంలో మహీకి విపరీతమైన క్రేజ్ పెరిగిపోగా.. క్రీడాభిమానులంతా అతడి సారథ్య సామర్థ్యానికి బ్రహ్మరథం పట్టారు. అదే సమయంలో స్వదేశంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు అంకురార్పణ జరిగింది. దేశంలోని ఎనిమిది ప్రధాన నరగాల నుంచి ఒక్కో ఫ్రాంచైజీ ఒక్కో జట్టును కొనుగోలు చేసుకొని లీగ్ ప్రారంభించింది. ఇలా స్టార్ట్ అయిన ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్.. మహీని తమ జట్టు సారథిగా ఎంచుకుంది.
2008లో జరిగిన తొలి ఐపీఎల్ సీజన్ నుంచి ఇటీవలి వరకు ధోనీనే.. చెన్నై ను ముందుకు నడిపించాడు. ఈ 16 సీజన్లలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న మహీ.. తదుపరి నాయకుడిని కూడా తీర్చిదిద్దాడే అనే ప్రశ్నలకు అవుననే జవాబు లభిస్తోంది. ఎల్లో జెర్సీలో మరెంతో కాలం ఆడలేనని నిర్ణయించుకున్న ధోనీ.. 2022 సీజన్‌లో జట్టు పగ్గాలను రవీంద్ర జడేజాకు అప్పగించగా.. అతడు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. వికెట్ల వెనుక ధోనీ ఉండటం సాధారణంగా ఆటగాళ్లెవరికైనా ప్లస్ పాయింటే కానీ.. సారథికి మాత్రం కాస్త ఒత్తిడే అని చెప్పొచ్చు. అంతకుముందు వరకు మహీ నాయకత్వంలో దూసుకెళ్లిన జట్టు జడ్డూ వచ్చేసరికి సాధారణ టీమ్‌లా కనిపించింది. దీంతో వరుస పరాజయాలు వెక్కిరించాయి. దీంతో పునరాలోచనలో పడ్డ మేనేజ్‌మెంట్.. తిరిగి మహీకే సారథ్య బాధ్యతలు అప్పగించింది.
వేలంలోనూ తొలి ప్రాధాన్య ఆటగాడి స్థానాన్ని తనంతట తానే వదులుకున్న మహీ.. భవిష్యత్తు కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్‌ను సానా బెట్టాడని చెన్నైకి ప్రాతినిధ్యం వహించిన అంబటి రాయుడు పేర్కొన్నాడు. ప్రస్తుత జట్టులో అతడికే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి అని అంబటి అన్నాడు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సుదీర్ఘ కాలం జట్టును నడిపించే ఆటగాడు కావడంతోనే గైక్వాడ్‌ను ఆ దిశగా ధోనీ తీర్చిదిద్దాడని వెల్లడించాడు. ఓపెనర్‌గా జట్టులో తనకంటూ చక్కటి గుర్తింపు తెచ్చుకున్న రుతురాజ్.. భవిష్యత్తు సారథిగానూ ఆకట్టుకోవాలని ఆశిద్దాం. కెప్టెన్‌గా తప్పుకున్నా.. ఏదో ఒక రూపంలో చెన్నైతో కలిసి నడుస్తానని గతంలో ధోనీ పలుమార్లు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అలాంటప్పుడు ‘తలా’ కనుసన్నల్లో రుతురాజ్ సీఎస్కేను ముందుకు తీసుకెళ్తాడనడంలో ఎలాంటి సందేహం లేదు.