పుత్తడి బొమ్మ పూర్ణమ్మ.. ఈమె గురజాడ అప్పారావు రాసిన కథలోని ఓ అందమైన చిన్నారి. ఆ కాలంలో జరుగుతున్న పరిస్థితులకు అనుగుణంగా రాసిన ఈ కథలో పుత్తడి బొమ్మ పూర్ణమ్మకు చాలా అన్యాయం జరిగింది. ఆ కాలంలో తినడానికి తిండి లేక పేదరికంతో అల్లాడుతున్న కుటుంబాలు ఆడపిల్లలను అమ్మేవారు. అలా చిన్న వయస్సులోనే పెళ్లి చేసుకున్న ఆ ఆడపిల్లల జీవితాలు బుగ్గిపాలు అయ్యేవి. అది ఒకప్పటి కాలం. కానీ.. అచ్చం అలాంటి పరిస్థితులే నేటి కాలంలో కూడా ఓ దేశంలో చోటు చేసుకుంటున్నాయి. అదే ఆఫ్గానిస్తాన్..
తాలిబన్ చేరలోకి వెళ్లిన అనంతరం ఆ దేశ ప్రజల పరిస్థితి దారుణంగా తయారైయింది. ఎంతటి దారుణ స్థితి అంటే తినడానికి తిండి లేక ఆడపిల్లలను అమ్మేస్తున్నారు. కనీసం వారైన బ్రతికుంటే చాలనుకుంటున్నారు. తమ దగ్గర ఆకలితో చావటం కంటే, పెళ్లి పేరుతో వారిని డబ్బున్న వారి దగ్గర ఉంటే మేలనుకుంటున్నారు. ఆకలి పేగుబంధాన్ని తెంచేసి వారి చేత ఈ పని చేయిస్తుంది. ఇది అక్కడ ఓ ఇంటిదో, ఒక ప్రాంతానిదో కథ కాదు అఫ్గానిస్తాన్లో ఇది ప్రతి పేదింటి కథ.. అసలు వారి కన్నీటి గాథ ఏమిటో తెలుసుకుందాం.
అమెరికా తమ భద్రత బలగాలు ఆఫ్గానిస్తాన్ నుంచి వెనుదిరిగాక ఆగస్టులో తాలిబాన్లు ఆక్రమించుకున్నారు. ఆఫ్గానిస్తాన్ వారి వశం అయ్యాక అక్కడి పరిస్థితులు మారిపోయాయి. విదేశాల్లో ఉన్న అఫ్గాన్ దేశ ఆస్తులు, డబ్బులను ఆ దేశాలు స్తంభింప చేశాయి. ఆ దేశానికి అందే సాయమూ ఆగిపోయింది. కొన్ని నెలల్లోనే దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైంది. పనులు లేకుండా పోయాయి. చాలా మందికి ఉద్యోగాలూ పోయి జీతాలు ఆగిపోయాయి. పేదరికం పెరిగిపోయి తిండి దొరకడమూ కష్టమైంది. దీనికి తోడు ఆహార, వస్తువుల ధరలు పెరిగిపోయాయి. దీంతో అక్కడి పేద ప్రజలు తిండి కోసం అల్లాడుతున్నారు. తిండిలేక చనిపోయిన వారు ఉన్నారు. కళ్ల ముందు తమ వారు ఆకలి మరణిస్తుంటే ఒక్కొక్కరి హృదయం విలవిలలాడుతుంది.
ఈ దారుణ పరిస్థితులను ఎదుర్కొటానికి చేసేది ఏమిలేక అఫ్గానీలు తమ చిన్నారి కూతుళ్లను అమ్ముతున్నారు. 20 రోజుల పిల్లల నుంచి 18 ఏళ్ల అమ్మాయిలను అమ్ముతున్నారు. కొందరు ముందస్తుగానే చిన్నారులను అమ్మకపు ఒప్పందం చేసుకుంటున్నారు. మరికొందరు అప్పు కింద పిల్లల్ని వారికి ఇచ్చేస్తున్నారు. తాలిబాన్లు అధికారం చేజిక్కించుకోకముందు అఫ్గాన్లో అధికారికంగా పెళ్లి వయసు 16 ఏళ్లు. కానీ.. వీరి ఆక్రమణ తరువాత బాల్యా వివాహాలు పెరిగాయి. ఇవి మున్ముందు రెండింతలయ్యే అవకాశం కూడా ఉందని నిపుణులు తెలిపారు. 20 రోజుల పిల్లలను కూడా మున్ముందు పెళ్లి చేసుకునేలా ఒప్పందాలు చేసుకుంటున్నట్లు యునిసెఫ్ తెలిపింది.తాజాగా ఇలా 20 ఏళ్ళ పసికందుకి వివాహ ఒప్పందం జరిగిందన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కన్నతల్లే ఈ పెళ్లి ఒప్పందానికి అంగీకరించినట్టు తెలుస్తోంది. ఈ విషయం ఇప్పుడు అందరిని కలచి వేస్తోంది. మరి.. ఆఫ్ఘన్ లో జరుగుతున్న ఈ దారుణాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.