కరోన కరాళ నృత్యంలో జపాన్ కకావికలం!..

ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన మాయదారి కరోనావైరస్ మహమ్మారి వెంటాడుతోంది. పలు దేశాల్లో వైరస్‌ అదుపులోకి వస్తుండగా మరికొన్ని దేశాల్లో మాత్రం కొత్తగా మళ్లీ విజృంభిస్తోంది. తాజాగా జపాన్‌లోనూ వైరస్‌ తీవ్రత పెరుగుతోంది. ఫోర్త్ వేవ్‌ భయంతో జపాన్‌ నగరం ఒసాకా వణికిపోతోంది. మరికొన్ని రోజుల్లోనే జరిగే ఒలింపిక్స్‌ వేడుకలకు సన్నద్ధం అవుతున్న వేళ వైరస్‌ భయం ఒసాకా నగరాన్ని వెంటాడుతోంది. వైరస్‌ ఉద్ధృతి పెరగడంతో జపాన్‌లో రెండో అతిపెద్ద నగరమైన ఒసాకాతో పాటు మరో ఎనిమిది నగరాల్లోనూ హెల్త్‌ ఎమర్జెన్సీ అమలు చేస్తున్నారు. జపాన్‌లో ఇప్పటివరకు 7లక్షల 28వేల కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా, 12వేల మరణాలు సంభవించాయి. వైరస్‌ వ్యాప్తిని సమర్థవంతంగా నియంత్రించినప్పటికీ తాజాగా వైరస్‌ ఉద్ధృతి పెరగడం జపాన్‌ను ఆందోళనకు గురిచేస్తోంది.

Untitled 18కరోనాను కట్టడి చేయాలంటే ఏకైక మార్గం వ్యాక్సినేషన్. దీంతో ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియంగా విస్తృతంగా జరుగుతోంది. ఇప్పటికే అక్కడ పాజిటివ్‌ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుపోతున్నాయి. ఈ వారంలో 3849 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా జపాన్‌లో సంభవిస్తోన్న కొవిడ్‌ మరణాలు దాదాపు 25శాతం ఆ ఒక్క నగరంలోనే ఉంటున్నాయి. మూడు నెలల క్రితంతో పోలిస్తే ఇవి ఐదు రెట్లు ఎక్కువ. ఇప్పటికే అక్కడి ఆసుపత్రుల్లో 96శాతం పడకలు కొవిడ్‌ బాధితులతో నిండిపోయినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. తాజాగా ఆసుపత్రుల్లో చేరుతున్న రోగుల్లో తీవ్ర లక్షణాలు కనిపిస్తుండడంతో కోలుకోవడం ఇబ్బందిగా మారినట్లు అక్కడి వైద్యులు పేర్కొంటున్నారు. ఇలా ఆసుపత్రులకు రోగుల తాకిడి పెరగడంతో అక్కడి ఆరోగ్య వ్యవస్థ పూర్తిగా వైఫల్యం చెందినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.