బిగ్ బాస్ ఓ బ్రోతల్ స్వర్గం, రెడ్ లైట్ సంస్కృతి “సీపీఐ నారాయణ”!

హైదరాబాద్- బిగ్ బాస్ రియాల్టీ షో.. ప్రపంచ వ్యాప్తంగా ఎంత పాపులర్ అయ్యిందో అందరికి తెలుసు. మన తెలుగులోను ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 5 జరుగుతోంది. అక్కినేని నాగార్డున ఆ షోను హోస్ట్ చేస్తున్నారు. ఇక బిగ్ బాస్ షో చాలా మందిని అలరిస్తున్నప్పటికీ, ఈ రియాల్టీ షోపై వివాదాలు చాలానే ఉన్నాయి. న్యాయ స్థానాల్లో బిగ్ బాస్ షోపై పలు కేసులు పెండింగ్ లో ఉన్నాయి. తాజాగా కోర్టులో మరో పిటీషన్ దాఖలు కాబోతోంది.

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ బిగ్ బాస్ రియాల్టీ షో పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. బిగ్‌బాస్‌ కార్యక్రమం ఓ బ్రోతల్‌ స్వర్గమని, రెడ్‌ లైట్‌ సంస్కృతి లాంటిదని ఆయన కామెంట్ చేశారు. బిగ్ బాస్ కార్యక్రమాన్ని వెంటనే నిలిపివేయాలని మరోసారి కోర్టుకు వెళతానని నారాయు ప్రకటించారు. బిగ్‌ బాస్‌ హౌస్‌ లో యువతీ యువకులను 105 రోజులు ఒకే గదిలో పెడుతున్నారని, లోపల ముద్దులు పెట్టుకుంటున్నారని, డేటింగ్‌ చేయిస్తున్నారని, ఇది సాంస్కృతిక దోపిడీ అని నారాయణ ఆరోపించారు.

narayana bigg boss 1

బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని నారాయణ ప్రశ్నించారు. బిగ్ బాస్ కార్యక్రమాన్ని 24 గంటలూ ప్రత్యక్ష ప్రసారం చేయగలరా అని ఆయన నిర్వాహకులకు సవాల్‌ విసిరారు. బిగ్ బాస్ రియాల్టీ షో ద్వార భావీ తరాలకు ఏంచెప్పాలనుకుంటున్నారని నారాయణ నిలదీశారు. ఇలాంటి షోల ద్వార పిల్లలు ఏంనేర్చుకుంటారో అసలు అవరికైనా అర్ధం అవుతుందా అని అసహనం వ్యక్తం చేశారు.

బిగ్ బాస్ కార్యక్రమాన్ని వెంటనే ఆపెయ్యాలని నారాయణ డిమాండ్ చేశారు. ఈమేరకు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేయబోతున్నట్లు ఆయన తెలిపారు. బిగ్ బాస్ లాంటి విచ్చలవిడి కార్యక్రమాలను ప్రేక్షకులు సైతం ఆదరించకూడదని నారాయణ సూచించారు. ఇలాంటి విపరీత ధోరణితో కూడిన కార్యక్రమాలు సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతాయని, అందుకని బిగ్ బాస్ కార్యక్రమాన్ని అంతా బ్యాన్ చేయాలని నారాయణ పిలుపునిచ్చారు.