బేబీ కర్ణ!.. గంగానదిలో పెట్టెతో కొట్టుకొచ్చిన పాప!

ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో సదర్ కొత్వాలి ప్రాంతంలోని దాద్రి ఘాట్ దగ్గర గంగానదిలో చంటిబిడ్డ కొట్టుకువచ్చిన సంచలన ఘటన బుధవారం జరిగింది. గంగానదిలో చంటిబిడ్డ ఏడుపులు వినిపిస్తుండటంతో పడవ నడిపే వ్యక్తి ఆశ్చర్యపోయాడు. చుట్టూ చూశాడు. ఎక్కడా బిడ్డ జాడలేదు. కానీ ఏడుపులు మాత్రం వినిపిస్తున్నాయి. దీంతో తీవ్రంగా పరిశీలించి చూడగా నదిలో ఓ చెక్కపెట్టె కొట్టుకువస్తుండటం చూశాడు. ఆ పెట్టెనుంచే చంటిబిడ్డ ఏడుపులు వినిపిస్తున్నాయని తెలుసుకున్నాడు. నదిలోంచి ఆ పెట్టెను ఒడ్డుకు తీసుకొచ్చి తెరిచి చూడగా అందులో ఓ చంటిబిడ్డ కన్పించింది.

కుంతీదేవి పసిబిడ్డగా ఉన్నప్పుడు కర్ణుడిని నదిలో వదిలిపెట్టేసిందని., మిథిల రాజ్యంలో  పొలం దున్నుతుండగా  పెట్టెలో దొరికిన పసిపాపను సీతగా జనక మహారాజు పెంచుకున్నాడని పురాణం. చాలా సినిమాల్లోనూ చూశాం. ఒడ్డుకు వచ్చి తెరిచి చూసిన జాలరి ఒక్కసారిగా షాక్‌ తిన్నాడు. పెట్టెలో ఎర్రని వస్త్రం, అమ్మవారి ఫొటోలు ఉన్నాయి. వాటితో పాటు ఓ చిన్నారి కూడా ఉండడంతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు.  అంతేకాదు అందులో ఆ పాప పుట్టిన తేదీ, సమయం, జాతకం వివరాలతో కూడిన చార్ట్ కూడా ఉంది.

baby karna.jpg02 minజాతకంలో ఈ చిన్నారి పుట్టిన తేదీ మే 25, అమ్మాయి పేరు గంగా అని రాసిపెట్టారు. ఇప్పుడా చిన్నారి తల్లిదండ్రులు ఎవరన్నదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కొన్ని తాంత్రిక క్రియల్లో భాగంగానే ఇలా చేశారా? అన్న కోణంలోనూ పోలీసులు పరిశోధిస్తున్నారు. గంగమ్మ తల్లే తనకు ఈ బిడ్డను ఇచ్చిందని పడవ నడుపుకునే వ్యక్తి మురిసిపోయాడు. బిడ్డను పెంచుకుంటానని చెప్పాడు. అయితే నిరాకరించిన పోలీసులు సంఘటన పూర్వాపరాలపై ఆరా తీస్తున్నారు.

బిడ్డను స్వాధీనం చేసుకుని ఆశాజ్యోతి కేర్ సెంటర్‌కు తరలించారు. మరోవైపు ఈఘటనపై స్పందించిన యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ పాప బాధ్యతను పూర్తిగా తీసుకుంటామని ప్రకటించినట్టు IANS వార్తా సంస్థ ట్వీట్‌ చేసింది.