సెకండ్ వేవ్ కల్లోలంలో ఎన్నో కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి. ఈ వైరస్ కారణంగా కోలుకున్నట్లే కోలుకుని కూడా కన్నుమూస్తున్నారు. తాజాగా ఇద్దరు కవలలు రోజు వ్యవధిలో మహమ్మారి కారణంగా ఈ లోకాన్ని వీడి వెళ్లారు. ఏప్రిల్ 23, 1997న మీరట్‌కు చెందిన గ్రెగరీ రైమండ్, సోజా దంపతులకు పండంటి కవలలు జన్మించారు. వారి పేర్లు జోఫ్రెడ్ వాగెసే గ్రెగరీ, రాల్‌ఫ్రెడ్ వాగెసే గ్రెగరీ. వారు పుట్టినప్పటి నుంచీ ఆ కుటుంబంలో అన్నీ సంతోషాలే. ఆ కవలలకు ఒకరంటే ఒకరికి ఎంతో అభిమానం. ఎక్కడికి వెళ్లినా, ఏం చేసినా కలిసే ఉండేవారు. ఇద్దరూ క్యాంపస్ ప్లేస్‌మెంట్లలో భాగంగా జోఫ్రెడ్ అసెంచర్‌లో ఉద్యోగం సంపాదిస్తే రాల్‌ఫ్రెడ్ హుందాయ్ మ్యుబిస్ కంపెనీ ఉద్యోగానికి కుదిరాడు. ఆరు అడుగుల ఎత్తుతో, ఆకట్టుకునే రూపాలతో ఉండే కొడుకులు ముఖ్యంగా ప్రతీ పనిలోనూ ఒకరికి ఒకరు తోడుగా ఉండే కలివిడితనం చూసి రేమండ్ దంపతులు మురిసిపోని రోజు లేదు. ఇక ఈ కవలలు ఆరు అడుగుల ఎత్తుతో, ఆకట్టుకునే రూపాలతో ఉండేవారు. ఎంతో సంతోషంగా జీవిస్తున్న ఆ కుటుంబాన్ని కరోనా మహమ్మారి వెంటాడింది. కలిసి పుట్టిన కవలలు కరోనా బారిన పడి రోజు వ్యవధిలో చనిపోయారు.
చెట్టంత ఎదిగిన కొడుకులు కళ్ల ముందే కన్నుమూయడంతో తల్లిదండ్రులు గుండెలు పగిలేలా విలపిస్తున్నారు. కవలలు ఇద్దరూ వర్క్ ఫ్రం హోం ఆప్షన్ ఉండటంతో ఇంటికి వచ్చి పని చేసుకుంటున్నారు. ఏప్రిల్ 23న ఇద్దరికీ జ్వరం వచ్చింది. ఎందుకైనా మంచిదని డాక్టర్ల సలహాతో మెడికేషన్ ప్రారంభించారు. కానీ వారం రోజుల్లోనే పరిస్థితి అదుపుతప్పినట్లు అనిపించింది. మే 1 వాళ్లను లోకల్ ఆస్పత్రిలో చేర్పించారు. టెస్టుల్లో కరనా వచ్చినట్లు తేలింది. ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడంతో వెంటిలేటర్‌పై ఉంచి ట్రీట్మెంట్ అందించారు. కాస్త పరిస్థితి మెరుగుపడింది అనుకున్నారు. పది రోజుల తర్వాత ఇద్దరికీ నెగటివ్ వచ్చింది. అయినా కానీ మూడు రోజుల్లోనే పరిస్థితులు మారిపోయాయి. జాఫ్రెడ్ మహమ్మారితో పోరాడలేక తుదిశ్వాస విడిచాడు. ఈ విషయాన్ని తల్లిదండ్రులు రాల్‌ఫ్రెడ్‌కు చెప్పలేదు. 24 గంటలు గడవకముందే తను కూడా తనకెంతో ఇష్టమైన కవల సోదరుడి దగ్గరకు వెళ్లిపోయాడు.