స‌ర‌యూ తీరంలోనూ కొట్టుకొస్తోన్న మృత‌దేహాలు!..

ఉత్తరాఖండ్‌లోని పిథౌర్‌గ‌ఢ్‌ జిల్లాలో స‌ర‌యూ నది ఒడ్డున డజన్ల కొద్దీ మృతదేహాలు క‌నిపించ‌డంతో స్థానికులు భయాందోళనలు వ్య‌క్తం చేస్తున్నారు. ఈ మృతదేహాలు క‌రోనా బాధితుల‌కు చెందినవని భావిస్తున్నారు. కరోనా సెకెండ్ వేవ్‌ వ్యాప్తి మధ్య గంగ‌తోపాటు ఇతర నదుల ఒడ్డున మృతదేహాలు క‌నిపించ‌డం ఇటీవలి కాలంలో సంచలనంగా మారింది. ఈ విధంగా న‌దీ తీరాల‌లో మృత‌దేహాలు క‌నిపించ‌డం ఉత్తరప్రదేశ్, బీహార్ మధ్యప్రదేశ్ త‌దిత‌ర రాష్ట్రాల్లో చోటుచేసుకుంది. తాజాగా ఉత్తరాఖండ్‌లోని స‌ర‌యూ నదిలో కూడా మృత‌దేహాలు తేలుతూ క‌నిపిస్తున్నాయి. మృతదేహాలు క‌నిపించిన‌ ప్రదేశానికి 30 కిలోమీటర్ల దూరంలోనే జిల్లా కేంద్రం ఉంది.

body sarayu

తాగునీటి సరఫరా కోసం ఈ నది నీటినే వినియోగిస్తుంటారు. ఈ నీరు కలుషితం కావడం వల్ల క‌రోనా వ్యాప్తి చెందుతుందని స్థానికులు భయపడుతున్నారు.ఇప్ప‌టికే ఈ జిల్లాలో క‌రోనా కేసులు అత్య‌ధికంగా ఉన్నాయి. ఈ సంద‌ర్భంగా తహసీల్దార్ పంకజ్ చందోలా మాట్లాడుతూ న‌ర‌యూ నదిలో దొరికిన మృతదేహాలు పిథౌర్‌గ‌డ్‌కు చెందినవి కాదని స్ప‌ష్టం చేశారు. ఈ మృతదేహాలను ఇంకా గుర్తించలేద‌ని, అవి ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకోవడానికి పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నార‌న్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో గంగానది ఒడ్డున రోజుకోచోట ఇసుకలో కుప్పలు తెప్పలుగా మృతదేహాలు కనిపించడం, ఆందోళన పెరగడం ఈమధ్యే జరిగిందన్న విషయం తెలిసిందే