చిన్నతనం నుంచి పురుషుడిగా మారాలని అనుకున్న సరితా సింగ్ అనే ఓ మహిళా టీచర్ లింగమార్పిడి శస్త్ర చికిత్స చేయించుకుంది. లింగమార్పిడి ధృవీకరణ సర్టిఫికేట్ ను కూడా ప్రభుత్వం నుంచి పొందింది.
జన్యుపరమైన లోపాలు, హార్మోన్ల ప్రభావాలతో కొంత మంది ట్రాన్స్ జెండర్లుగా మిగిలిపోతున్నారు. సమాజంలో గుర్తింపు లేక, అయిన వారి ఆదరణ లేక అత్యంత దయనీయ స్థితిలో వీరు జీవిస్తున్నారు. తమకంటూ ఉపాధి దొరకక, ప్రభుత్వాలు ఆదుకోక సొసైటీలో చీత్కారాలకు గురవుతున్నారు. వైద్య రంగంలో వచ్చిన ఆధునిక వైద్య విధానాలతో లింగమార్పిడి చేసుకోవడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఓ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బుద్దాదేవ్ భట్టాచార్య కుమార్తె సుచేతన భట్టాచార్య కూడా లింగమార్పిడి చేసుకుంటున్నట్లు తెలిపింది. ఇదిలా ఉంటే తాజాగా యూపిలో ఓ మహిళా టీచర్ పురుషిడిలా మారింది. పురుషుడిలా మారినట్లు దృవీకరణ పత్రాన్ని కూడా పొందింది. ఆ వివరాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉత్తర్ ప్రదేశ్ లో మహిళా టీచర్ గా విధులు నిర్వహిస్తున్న సరితా సింగ్ లింగ మార్పిడి చేయించుకుని శరత్ రోషన్ సింగ్ గా మారింది. గవర్నమెంట్ నుంచి ఆఫీషియల్ గా లింగమార్పిడి పొందినట్లు ఐడెంటిటి పొందడంతో ఆనందంలో మునిగిపోయింది. వివరాల్లోకి వెళ్తే.. యూపిలోని షహజాన్ పూర్ జిల్లాలోని నవాదా గ్రామానికి చెందిన యువతి సరితా సింగ్. కాగా ఆమె దివ్యాంగురాలు. ఈమెకు మరో యువతి సవితా సింగ్ చేదోడు వాదోడుగా ఉంటూ సహాయం చేస్తుండేది. సరితా సింగ్ కు చిన్నతనం నుంచే అబ్బాయిల డ్రెస్ లు ధరించడం, హెయిర్ స్టైల్ కూడా అబ్బాయిల లాగానే తల దూసుకోవడం చేస్తుండేది. అయితే సరితా సింగ్ బేసిక్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ లో స్కూల్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తుంది. చిన్నప్పటి నుంచే పురుషుడిగా ఉండాలన్న కోరికతో సరితా సింగ్ లింగమార్పిడి చేసుకోవాలని నిర్ణయించుకుంది.
దీనికోసం మానసికంగా సిధ్దమై లఖ్ నవూలో హార్మోన్స్ మార్పిడి థెరపీ చేయించుకున్నారు. హార్మోన్స్ మార్పిడితో సరితా సింగ్ లో పురుషుడిలా గొంతు మారి ముఖంపై గడ్డం కూడా వచ్చింది. దీని తర్వాత మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఓ ఆసుపత్రిలో లింగమార్పిడి శస్త్ర చికిత్స చేయించుకుని సరితా సింగ్ కాస్త శరత్ రోషన్ సింగ్ గా మారాడు. పురుషుడిగా మారిన అతడికి షహజాన్ పూర్ జిల్లా మెజిస్ట్రేట్ లింగ మార్పిడి ధృవీకరణ సర్టిఫికేట్ ను అందించారు. దీంతో సరితా సింగ్ నుంచి శరత్ రోషన్ సింగ్ గా మారడంతో ఆనందంలో మునిగిపోయాడు. ఇక దివ్యాంగురాలైన తనకు ఎళ్లవేళల తోడున్న సవితా సింగ్ ను పెళ్లి చేసుకుంటానని తెలిపాడు. దీనికి సవితా సింగ్ ఓకె చెప్పడంతో వీరి పెళ్లికి లైన్ క్లియర్ అయ్యింది.