అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్యాన్ ఇండియా లెవల్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ పుష్ప సినిమా మొన్నటి వరకు షూటింగ్ జరుపుకుంది. కరోనా కారణంగా ఇటీవల షూటింగ్ వాయిదా పడింది. అది అలా ఉంటే ఈ సినిమా రెండు పార్ట్స్ గా విడుదల చేయబోతున్నారని ఓ వార్త హల్ చల్ చేసింది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ కథానాయకుడిగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘ఐకాన్’ అనే సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు దీన్ని నిర్మించనున్నారు. అప్పట్లో పవన్‌తో ‘వకీల్‌సాబ్’ తెరకెక్కిస్తుండటంతో ‘ఐకాన్’ వాయిదా పడింది. ఇప్పుడు పవన్ చిత్రం రిలీజ్ కావడంతో బన్ని సినిమా ఎప్పుడు మొదలు పెడతారన్న ప్రశ్న అభిమానుల్లో నెలకొంది. దీనిపై నిర్మాత దిల్‌రాజు స్పష్టత ఇచ్చారు. పుష్ప టీజర్‌లో అల్లు అర్జున్ పేరు ముందు స్టైలిష్ స్టార్‌కు బదులుగా ‘ఐకాన్ స్టార్’ గా ఎందుకు వేశారని దిల్ రాజు ప్రశ్నించగా.. దానికి సమాధానమిస్తూ ఆ బిరుదును అల్లు అర్జున్ స్వయంగా పెట్టుకున్నట్టు చెప్పుకొచ్చారు. ఇందులో తన ప్రమేయం ఏమి లేదన్నారు. మన హీరోలు ఒకసారి సెట్ అయిన ప్రాజెక్ట్‌లను రద్దు చేసుకొని వేరే ప్రాజెక్ట్‌లను ముందుగా ప్రారంభించేస్తున్నారు. ఇప్పటి వరకు దిల్ రాజు క్యాంప్‌లోనే ఉన్న వేణు శ్రీరామ్ ఇప్పుడా క్యాంప్‌కు కూడా గుడ్ బై చెప్పేస్తున్నారనేలా కూడా వార్తలు వినవస్తున్నాయి.
ఇదే నిజమైతే వేణు శ్రీరామ్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లే. ప్రస్తుతం వేణు శ్రీరామ్ ఓ యంగ్ హీరోతో సినిమా చేసేందుకు అన్నీ సమకూర్చుకున్నాడని, బ్యానర్ కూడా రెడీ అయిందని, పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాత మూవీ ప్రకటన చేయనున్నారనేలా వార్తలు వినబడుతున్నాయి. ‘వకీల్ సాబ్’ హిట్ తర్వాత ‘ఐకాన్’కు ఇక ఢోకా ఉండదని దిల్ రాజు, వేణు శ్రీరామ్ భావించారు. ఖచ్చితంగా ఈ సినిమా ఉంటుందని వీరిద్దరూ ప్రతి ప్రెస్ మీట్‌లో చెబుతూనే ఉన్నారు. కానీ అల్లు అర్జున్ సైడ్ నుంచి ఈ సినిమాకు సరైన క్లియరెన్స్ రాకపోవడంతో దర్శకుడు వేణు శ్రీరామ్ ఆ ప్రాజెక్ట్ పక్కనెట్టి మరో హీరోతో సినిమా చేయడానికి రెడీ అయినట్లుగా టాలీవుడ్‌లో వార్తలు మొదలయ్యాయి. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియాలంటే వేణు శ్రీరామ్ వైపు నుంచి క్లారిటీ రావాల్సిందే.