ఐపీఎల్ లో అదరగొడుతున్న మ్యాక్స్ వెల్.. కోహ్లీపై ప్రశంసలు

maxwell virat

ఐపీఎల్‌ 2021 సీజన్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు పిచ్చ ఫామ్‌లో కొనసాగుతోంది. ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్‌లలో 8 గెలిచి, 4 ఓడిన ఆర్సీబీ 16 పాయింట్లతో పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఎప్పుడూ లేని విధంగా అత్యుత్తమ ఫామ్‌తో ప్లే ఆఫ్స్‌కు చేరింది. ‘ఏ సాలా కప్‌ నమ్‌దే’ అనే స్లోగన్‌కు సార్థకత దొరికే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. ఆర్సీబీలో ఒకరని కాదు.. మొత్తం టీమ్‌ అంతా అద్భుతంగా రాణిస్తోంది. మరీ ప్రత్యేకంగా ఆస్ట్రేలియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ తన ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు.

2014 తర్వాత మళ్లీ ఈ సీజన్‌లోనే

గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌పై మొన్నటివరకు ఒక మచ్చ ఉండేది. అతను ఆస్ట్రేలియా తరఫున తప్పితే ఐపీఎల్‌లో రాణించడు అని అపఖ్యాతిని మూటకట్టుకున్నాడు. దాదాపు 2014 సీజన్‌ తర్వాత అతను అత్యుత్తమంగా రాణించింది ఏమీ లేదు. కోట్లు కొన్న ఫ్రాంచైజీలకు నిరాశ మిగిల్చాడు. 2019 డిసెంబర్‌ వేలంలో మ్యాక్స్‌వెల్‌ను 10 కోట్ల రూపాయలకు పంజాబ్‌ కింగ్స్‌(అప్పుడు కింగ్స్‌ లెవెన్‌ పంజాబ్‌) దక్కించుకుంది. ఐపీఎల్‌-13 సీజన్‌లో పంజాబ్‌ తరఫున మ్యాక్స్‌వెల్‌ మొత్తం 13 మ్యాచ్‌లు ఆడాడు. 13 మ్యాచుల్లో మ్యాక్స్‌వెల్‌ చేసింది 108 పరుగులు మాత్రమే. తీవ్ర నిరాశకు గురైన పంజాబ్‌ కింగ్స్‌ యాజామాన్యం గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ను రిటైన్‌ చేసుకోలేదు.

ఇదీ చదవండి: వచ్చే వేలంలో హాట్‌ ఫేవరెట్‌ గా డేవిడ్‌ వార్నర్‌.. రూ.14 కోట్లు పక్కా!

maxwell viratకోహ్లీ వ్యూహం ప్రకారమే..

వేలంలోకి వచ్చిన మ్యాక్స్‌వెల్‌ను తప్పకుండా తీసుకోవాలని కోహ్లీ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు యాజమాన్యానికి సూచించాడు. అతను తమకు తప్పకుండా ఉపయోగపడతాడని కోరాడు. కోహ్లీ పట్టుబట్టడంతో ఆర్సీబీ యాజమాన్యం గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ను తీసుకుంది. అది కూడా అంత ఈజీగా అవ్వలేదు. అతడ్ని దక్కించుకునేందుకు.. చెన్నై సూపర్‌ కింగ్స్‌తో పోటీ పడి 14.25 కోట్లు వెచ్చించి దక్కించుకుంది.

ఈ సీజన్‌లో అద్భుతంగా రాణించిన మ్యాక్స్‌వెల్‌

ఈ సీజన్‌లో ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు ఎంతో సునాయాసంగా చేరింది అంటే అందులో మ్యాక్స్‌వెల్‌ కీలకపాత్ర పోషింయాడు. ఈ సీజన్‌లో ఆర్సీబీ తరఫున అన్ని మ్యాచుల్లో మ్యాక్స్‌వెల్‌కు కోహ్లీ అవకాశం కల్పించాడు. కోహ్లీ నమ్మకాన్ని ఏ మాత్రం వమ్ము చేయని మ్యాక్స్‌వెల్‌ 12 మ్యాచుల్లో 407 పరుగులు సాధించాడు. 3 వికెట్లు కూడా తీశాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 5 అర్ధశతకాలు చేశాడు. వాటిలో హ్యాట్రిక్‌ అర్ధశతకాలు ఉన్నాయి. బౌలింగ్‌లోనూ మంచి ప్రదర్శన చేశాడు. ఈ సీజన్‌లో 3 వికెట్లు కూడా తీశాడు మ్యాక్సీ. మ్యాక్స్‌వెల్‌ను పట్టుబట్టి తీసుకున్నందుకు కెప్టెన్‌ కోహ్లీపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. దాదాపు అందరూ వద్దనుకున్న మ్యాక్సీపై నమ్మకం ఉంచి అవకాశం కల్పించడాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు.

మరి.. మ్యాక్స్‌వెల్‌ భీకర ఫామ్‌కి కోహ్లీ కారణమని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.