దేశంలో ఎన్ని చట్టాలున్నా చిన్నారులు, యువతులు, మహిళలపై అత్యాచారాలు ఆగడం లేదు. బయట వ్యక్తుల కన్నా తెలిసిన వారి చేతుల్లోనే బలైపోతున్నారు. కుమార్తెగా చూడాల్సిన కోడలిపై కామ వాంఛ తీర్చుకుంటున్న దుర్మార్గుడి గురించి పోలీసులకు చెబుతున్నా వినిపించుకోలేదు. దీంతో ఆమె ఏం చేసిందంటే.?
దేశ న్యాయ వ్యవస్థలో పోక్సో, నిర్భయ, దిశ వంటి అత్యాచార నిరోధక చట్టాలు ఎన్నిఉన్నా నిందితులకు చుట్టపు చూపుగా మారిపోతున్నాయి. ఆడపిల్లయితే చాలు మాన భంగాలకు ఒడిగడుతున్నారు. ఇంటా, బయటా, ఆఫీసుల్లో ఎక్కడా మహిళలను వదలడం లేదు. ఆడపిల్లలపై అఘాయిత్యాలకు ఒడిగడుతున్న వారిలో అత్యధికులు వారికి తెలిసిన వారూ, బంధువులే కావడం గమనార్హం. బయట వ్యక్తులు అత్యాచారానికి పాల్పడితే.. పోలీసులకు చెబితే చర్యలైనా ఉంటాయి. అదే ఇంట్లో వ్యక్తే తన పట్ల వెకిలి చేష్టలకు పాల్పడుతున్నాడంటే చెబితే ముందుగా బాధితులనే నిందిస్తారు. నిందితుడిపై ఎటువంటి చర్యలు తీసుకోరు. ఇలాంటి సమస్యనే ఎదుర్కొందీ ఓ ఇంటి కోడలు.
కూతురుగా భావించాల్సిన కోడలిపై కన్నేశాడో మామ. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. మీరట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సివిల్ లైన్ ప్రాంతానికి చెందిన ఓ వివాహిత తనపై మామ చేస్తున్న అఘాయిత్యాన్ని పోలీసులకు సిగ్గు విడిచి చెప్పుకుంది. తనకు నాలుగేళ్ల క్రితం వివాహం జరగిందని, తన భర్త డ్రైవర్ గా పనిచేస్తున్నాడని, అతడూ డ్యూటీకి వెళ్లే సమయంలో మామ తనపై అత్యాచారం ఒడిగడుతున్నాడంటూ పోలీసుల వద్ద కన్నీటి పర్యంతమైంది. అయితే సరైన సాక్ష్యాలు లేకపోవడంతో పోలీసులు పట్టించుకోలేదు. పలు మార్లు పోలీసులకు చెప్పిన ఉపయోగం లేకపోవడంతో మామ బండారాన్ని బయటపెట్టాలని నిర్ణయించుకుంది.
ఎన్నిసార్లు పోలీసులకు చెప్పినా వినిపించుకోకపోవడంతో.. అతడి దుర్మార్గాన్ని రహస్యంగా సెల్ ఫోన్‌లో రికార్డు చేసి డైరెక్ట్ గా ఎస్పీ ముందు పెట్టింది. బాధితురాలు చూపించిన సాక్ష్యంతో ఖంగుతిన్న పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఆమె చెప్పిన కథనం ప్రకారం.. పెళ్లి అయిన కొద్ది రోజుల తర్వాత నుంచి మహిళకు ఈ వేధింపులు మొదలయ్యాయి. మామ కోరిక తీర్చాలంటూ అత్త, మరిది సైతం వేధించేవారని పోలీసులకు చెప్పింది. భర్త ఇంట్లో లేని సమయంలో మామ తనతో అసభ్య కరమైన పనులు చేయించేవాడని లేదంటే తనపై చేయి చేసుకునే వారని తెలిపింది. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడైన మామను అరెస్టు చేశారు. అతడికి సహకరించిన కుటుంబ సభ్యులపై కూడా పోలీస్ కేసు నమోదు చేశారు. ఆ అఘాయిత్యానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.