వాహన ఇన్సూరెన్స్ లేకపోతే పోలీసులు ఎందుకు ఆపుతారు? ఇన్సూరెన్స్ కి, పోలీసులకు సంబంధం ఏమిటి? ఎందుకు చలానా వేస్తారు?
హెల్మెట్, ఇన్సూరెన్స్ అనేవి వ్యక్తిగతం. హెల్త్ ఇన్సూరెన్స్, హోమ్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ ఇవేమీ తీసుకోకపోయినా పోలీసులు మనల్ని ఆపరు. కానీ ముచ్చట పడి ఏదైనా వాహనం కొనుక్కుంటే మాత్రం ఇన్సూరెన్స్ ఉండాలని అంటారు. హెల్త్ ఇన్సూరెన్స్, హోమ్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ వంటివి లేనప్పుడు అడగని ట్రాఫిక్ పోలీసులు.. రోడ్డు మీద వెహికల్ ఇన్సూరెన్స్ లేకపోయినా ఎందుకు ఆపుతున్నారు? ఎందుకు చలానా వేస్తున్నారు? హెల్త్ ఇన్సూరెన్స్ లు, లైఫ్ ఇన్సూరెన్స్ లు మన వ్యక్తిగతం అయినప్పుడు, వెహికల్ ఇన్సూరెన్స్ కూడా మన వ్యక్తిగతమే కదా. అలాంటప్పుడు పోలీసులకు వెహికల్ ఇన్సూరెన్స్ తో ఏంటి పని? అసలు పోలీసులకు, ఇన్సూరెన్స్ కి సంబంధం ఏంటి? అని ఎప్పుడైనా ఆలోచించారా? అసలు వెహికల్ ఇన్సూరెన్స్ లేకపోతే పోలీసులు ఎందుకు ఆపుతారో తెలుసా?
చాలా మంది పోలీసులు చలానా విధిస్తారన్న భయంతో హెల్మెట్ పెట్టుకుంటున్నారు గానీ నిజానికి ఎవరి తల మీద వారికి పోలీసులకు, చట్టానికి ఉన్నంత శ్రద్ధ కూడా లేదు. ఇక వాహన ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ కూడా పోలీసులకు భయపడే చేసుకుంటున్నారు. నిజానికి పోలీసులకు, వాహన ఇన్సూరెన్స్ కి సంబంధం లేదు. కానీ ఆ ఇన్సూరెన్స్ లేకపోతే ఖచ్చితంగా ఆపి చలానా విధించే హక్కు వారికి ఉంది. మోటార్ వెహికల్ యాక్ట్ 1988 ప్రకారం.. ఒక వాహనానికి ఇన్సూరెన్స్ ఖచ్చితంగా ఉండాలి. ఉదాహరణకు మీరు ఒక వ్యక్తి కారు మీద వెళ్తూ ఒక బైక్ అతన్ని గుద్దితే.. అతని బైక్ డ్యామేజ్ అయ్యి అతనికి గాయాలు అయితే దానికి అయ్యే ఖర్చు భరించడం చాలా కష్టం. హాస్పిటల్ బిల్స్, బైక్ డ్యామేజ్ ఖర్చులు ఎక్కువైపోతాయి.
కొనక కొనక కారు కొనుక్కుంటే ఈ కర్మ ఏంటి అనిపిస్తుంది. కారు ఈఎంఐ కట్టాలి, అతని బైక్ తో కారు డ్యామేజ్ ఖర్చులు కూడా కారు యజమానే భరించాల్సి వస్తుంది. ఎంతని పెట్టుకోగలరు? ఆర్థిక పరిస్థితి బాగాలేకపోతే ఏ తప్పూ చేయని బైక్ అతను ఎందుకు హాస్పిటల బిల్స్, బైక్ డ్యామేజ్ ఖర్చులు పెట్టుకోవాలి? మరి గుద్దిన వ్యక్తి పెట్టుకోక, బైక్ అతను పెట్టుకోక ఈ సమస్యకి పరిష్కారం ఎలా? ఒకవేళ ప్రమాదంలో ఇద్దరికీ గాయాలు అయితే.. ఎవరు పెట్టుకోవాలి ఖర్చు? ఈ సమస్యకి పరిష్కారమే ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ చేయించుకుంటే గుద్దిన వ్యక్తికి, ప్రమాదానికి గురైన వ్యక్తికి ఇద్దరికీ వారు తీసుకున్న ఇన్సూరెన్స్ తాలూకు కంపెనీలు హాస్పిటల్ ఖర్చులు పెట్టుకుంటాయి.
అలానే వారి వాహనాల డ్యామేజ్ ఖర్చులు కూడా పెట్టుకుంటాయి. మనుషులనే కాదు, ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులను డ్యామేజ్ చేసినా కూడా ఇన్సూరెన్స్ కంపెనీలు ఆ డ్యామేజ్ ఖర్చులు పెట్టుకుంటాయి. ఏ మెట్రో పిల్లర్ నో, రోడ్డు పక్కన ఉన్న డివైడర్లనో డ్యామేజ్ చేస్తే ఆ ఖర్చు వాహన యజమానులు పెట్టుకోలేరు కాబట్టే ఇన్సూరెన్స్ యాక్ట్ వచ్చింది. అందుకే పోలీసులు ఇన్సూరెన్స్ లేకపోతే చలానా వేస్తారు. వారికేమీ మన మీద కోపం కాదు. ఇన్సూరెన్స్ చేయించుకోవడం వల్ల అవతల వ్యక్తికైనా, మనకైనా ఏదైనా జరిగితే ఆ ఖర్చు ఇన్సూరెన్స్ కంపెనీలు పెట్టుకుంటాయి. రాంగ్ రూట్ లో వచ్చి గుద్దింది నువ్వే, నువ్వే అని గొడవ ఆడుకునే పని ఉండదు.
అదన్నమాట విషయం. ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేది వ్యక్తిగతమే అయినా మన వల్ల భవిష్యత్తులో ఎప్పుడైనా జరిగే నష్టానికి బాధ్యత ఉండాలని ఇన్సూరెన్స్ ఖచ్చితంగా తీసుకునే బాధ్యతను పోలీసులు గుర్తు చేస్తారు. మరి మీరు ఖచ్చితంగా ఇన్సూరెన్స్ చేయించుకుంటారు కదూ. అలానే హెల్మెట్ కూడా పెట్టుకోండి. హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఖచ్చితంగా తీసుకోవాలి అని ఒక నియమం పెడితే బాగుంటుంది కదా. అప్పుడు ఏ మనిషీ కూడా అనారోగ్యంతో చికిత్స పొందలేక ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోరు. హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే చలానా వేసే రూల్ వస్తే మీ అభిప్రాయం ఏమిటి?