గుప్త నిధులు అంటే రహస్యంగా దాచిపెట్టబడిన నిధులు. ఇవి ఎక్కువగా పురాతన ఆలయాల్లో, ఆలయ గర్భ గుడుల్లో, విగ్రహాల కింద, ధ్వజస్తంభాల కింద, పొలాల్లో, పురాతన ఇళ్లల్లో, కొండ గుహల్లో దొరుకుతుంటాయి. గుప్త నిధుల కోసం ఆలయాలను ధ్వంసం చేస్తుంటారు. అసలు గుప్త నిధులను ఎందుకు భూములు, ఆలయాలు వంటి ప్రదేశాల్లో దాచి ఉంచేవారు. గుప్త నిధులను ధ్వజస్తంభాల కింద, విగ్రహాల లోపల ఎందుకు దాచేవారు? దాని వల్ల ప్రయోజనం ఏంటి? ప్రత్యేకించి ఆలయాల్లోనే గుప్త నిధులను ఉంచడం వెనుక కారణాలు ఏంటి? అసలు గుప్త నిధులు ఎన్ని రకాలు ఉన్నాయి? గుప్త నిధులు మూడు రకాలుగా ఉంటాయి. మొదటి రకం నిధులంటే జనం దాచుకున్న సొమ్ము. ప్రాచీన కాలంలో బంగారాన్ని దాచుకోవడానికి ఇప్పుడు బ్యాంకులు ఉన్నట్లు అప్పుడు బ్యాంకులు ఉండేవి కావు. ఆ సమయంలో జనాలు తమ ఇళ్లలో, పొలాల్లో గొయ్యి తవ్వి ఒక కుండలో బంగారాన్ని దాచి పెట్టుకునేవారు.
రెండవ రకం నిధులంటే గజదొంగలు దోచుకున్న సొత్తు. బందిపోటు దొంగలు అని వినే ఉంటారు. అప్పట్లో ఊర్ల మీద పడి బంగారం దోచుకుని.. ఆ బంగారాన్ని కొండ గుహలలో దాచి పెట్టేవారు. మూడవ రకం నిధులంటే.. రాజ నిధులు. వీటిని పూర్తిగా ఉద్దేశపూర్వకంగా రహస్య ప్రదేశాల్లో ఉంచేవారు. ఇలా ఎందుకు చేసేవారంటే.. అప్పట్లో దండయాత్రలు ఎక్కువ. రాజుల నాటి కాలంలో బంగారు రాశులు కుప్పలుకుప్పలుగా ఉండేవి. ప్రపంచంలో ఎక్కడ లేని పసిడి సంపద మన దేశంలోనే ఉండేది. విదేశీయులు దండయాత్రలకు ముందు ప్రపంచ జీడీపీలో మన దేశ జీడీపీ 25 నుంచి 35 శాతం ఉండేది. దీన్ని బట్టి మన దేశంలో సంపద ఎంత పుష్కలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇక బంగారం గురించి అయితే చెప్పాల్సిన పని లేదు. రాజుల కాలంలో బంగారానికి కొదవ లేదు. రాజా భవనాల్లో బంగారు నాణాలు, ఆభరణాలు కుప్పలు కుప్పలుగా ఉండేవి. అప్పట్లో రాజు మనసు గెలుచుకుంటే బంగారు నాణాలను పంచేవారు. అయితే పొరుగు దేశ రాజులు, బ్రిటిష్ వారి రాకతో ఈ సంపద కోసం భీకర పోరాటాలు జరిగేవి. భావి తరాలకు ఈ సంపద చెందాలన్న ఉద్దేశంతో.. విదేశీయులకు దక్కకూడదని వాటిని రహస్య ప్రదేశాల్లో దాచి పెట్టేవారు. ఆలయాల కంటే రహస్య ప్రదేశాలు ఇంకేముంటాయి. అందుకే వీటి దగ్గర దాచిపెట్టేవారు. ధ్వజ స్తంభాలు కింద, గర్భ గుడుల్లో ప్రత్యేకంగా మంత్రం, యంత్ర పూజలు చేసి.. నిధులను అందులో నిక్షిప్తం చేసేవారు. శక్తివంతమైన అస్ఖలిత బ్రహ్మచారులతో పూజలు చేయించేవారు.
గోపీచంద్ నటించిన సాహసం సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ సినిమాలో సుమన్ ని కొంతమంది చంపేందుకు వస్తుంటే.. తన దగ్గరున్న బంగారు నిధులను ఒక చోట భద్రంగా ఉంచుతారు. అలానే అప్పటి రాజులు కూడా బంగారు నిధులను విదేశీయులకు దక్కకూడదన్న ఉద్దేశంతో రహస్యంగా భద్రపరిచేవారు. ఆలయాల్లో ఉంటే ఆ దేవుడు రక్షిస్తాడని నమ్మకంతో కూడా దాచిపెట్టేవారు. ప్రజలకు అత్యవసరమైన సమయంలో ఆ నిధులను ఉపయోగించుకునేందుకు ఆ నిధులు ఎక్కడున్నాయో తెలిపే విధంగా ఒక మ్యాప్ ను కూడా రూపొందించేవారు. ఆ మ్యాప్ ఆధారంగా రాజు కుటుంబీకులు ఆ నిధులను తవ్వుకుని వాడుకునేలా ఉండేందుకు మ్యాప్ ని రూపొందించేవారు. అయితే చరిత్రలో వరుస దండయాత్రలు జరగడంతో.. నిధులనేవి బయటకు రాలేదు. అప్పుడప్పుడూ తవ్వకాల్లో బయటపడుతుంటాయి. కానీ ఇప్పటికే ఎన్నో నిధులు ఉన్నాయని చరిత్రకారులు చెబుతారు. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.