క్రమశిక్షణ ఎవరికి వారు నేర్చుకోవాలి లేదంటే సమాజం మనకి నేర్పి తీరుతుంది అని ఒక పెద్దాయన చెప్పారు. మరి ఎంతమంది మనుషులు క్రమశిక్షణతో ఉంటున్నారో తెలియదు గానీ చీమలు మాత్రం చాలా క్రమశిక్షణగా ఉంటున్నాయి. ఎప్పుడైనా గమనిస్తే అవి ఒక వరుస క్రమంలో ఒక దాని తర్వాత ఒకటి ప్రయాణం చేస్తాయి. వీటికి క్రమశిక్షణ ఎవరు నేర్పించారు? మనుషుల్లానే గొర్రెల్లా నాయకుడి వెంట వెళ్లడం వీటికి అలవాటా అంటే కాదు. అలా వెళ్లడం వెనుక శాస్త్రీయ కారణం ఉంది.
చీమలకు క్రమశిక్షణ ఎవరూ నేర్పలేదు. ఆ మాటకొస్తే క్రమశిక్షణ అన్న పదమే వాటికి తెలియదు. క్రమశిక్షణలో వెళ్ళడానికి చీమలకు చెవులు ఉండవు. కొన్ని చీమలకైతే కళ్ళు కూడా ఉండవు. అవి వేసే అడుగు ద్వారా నేల నుంచి వచ్చే కంపనాల ద్వారా వింటాయి. కళ్ళు లేని చీమలైతే తమ యాంటెనా ద్వారా కమ్యూనికేట్ చేసుకుంటాయి. ఈ యాంటెనా ద్వారానే అవి ఒక వరుస క్రమంలో వెళ్తాయి. అదెలా సాధ్యం అంటే.. చీమలు విడుదల చేసే ఫెరోమోన్స్ అనే రసాయనం. చీమలు తమ శరీరం నుంచి ఫెరోమోన్స్ అనబడే రసాయన సంకేతాలను విడుదల చేయడం ద్వారా మిగతా చీమలకు సంకేతాలు పంపిస్తాయి. సమీపంలో ఏదైనా ఆపద ఉంటే చీమలు మిగతా చీమలకు ఫెరోమోన్స్ విడుదల చేయడం హెచ్చరికలు పంపిస్తాయి.
ఆహారం కోసం వేటాడే సమయంలో ‘ఒరేయ్ ఆజామూ ఇదిగోరా ఇక్కడ ఉంది ఫుడ్డు’ అని చెప్పడానికి కూడా చీమలు ఈ రసాయనాన్ని విడుదల చేస్తాయి. మిగతా చీమలు ఈ రసాయనం వాసన ద్వారా లొకేషన్ కి చేరుకుంటాయి. మనకి గూగుల్ మ్యాప్స్ లా వాటికి రసాయన మ్యాప్స్ అన్నమాట. సహచర చీమలను ఆకర్షించడానికి కూడా ఈ రసాయనాన్ని విడుదల చేస్తాయి. ఒక చీమ ముందుకు వెళ్తుంటే రసాయనాన్ని విడుదల చేసినప్పుడు మిగతా చీమలు తమ యాంటెనా ద్వారా ఫెరోమోన్స్ ని గుర్తించి వరుస క్రమంలో వెళ్తుంటాయి. అంతే తప్ప ఇందులో ప్రత్యేకించి వేరే కారణం లేదు. ఇదే కాదు, ఇంకా చాలా ఉన్నాయి చీమల గురించి తెలియని విషయాలు.
చీమలు కుడితే కరెంట్ షాక్ కొట్టినట్టు ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా 12 వేల చీమల జాతులు ఉన్నాయి. అయితే వీటిలో బుల్లెట్ చీమ కుడితే చాలా బాధ కలుగుతుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత బాధ కలిగించే చీమ. అమెజాన్ లాంటి తేమ కలిగిన అడవుల్లో ఈ బుల్లెట్ చీమలు నివసిస్తాయి. ఈ చీమ కుడితే శరీరానికి బుల్లెట్ తగిలినట్టు ఉంటుంది. అందుకే దీన్ని బుల్లెట్ చీమ అని అన్నారు. ఫైర్ యాంట్స్ అని అగ్ని చీమలు ఉన్నాయి. మనం కరెంట్ చీమలు అని అంటాము. ఏడాదికి 3 బిలియన్ డాలర్ల నష్టాన్ని కలుగజేస్తాయి ఈ చీమలు. అంటే ఇవి కుట్టడం వల్ల చాలా మంది హాస్పిటల్ పాలై వైద్యానికి పెడుతున్న ఖర్చు. ఇక్కడ కాదులే, ఉత్తర అమెరికాలో. ఇవి కుడితే అంత బాధ కలుగుతుంది మరి.
ఇవి రైతులు వేసే పంటలను సైతం నాశనం చేస్తాయి. మిగతా జీవులతో పోలిస్తే చీమలు ఎక్కువ కాలం జీవిస్తాయి. కొన్ని పురుగులు గంటలు, రోజులు మాత్రమే బతుకుతాయి. కానీ పోగోనోమిర్మెక్స్ ఓవిహై అనే ప్రత్యేక జాతికి చెందిన రాణి చీమలు అంటే ఆడ చీమలు మాత్రం 30 ఏళ్ల వరకూ జీవిస్తాయి. దాని పరిమాణంలో పోలిస్తే ప్రపంచంలోనే బలమైన జీవి ఈ చీమ. ఒక్కో చీమ దాని బరువు కంటే 50 రెట్లు అధిక బరువు కలిగిన వస్తువులను మోయగలవు. కలిసి బృందంగా ఏర్పడి కూడా బరువైన వస్తువులను మోయగలవు. ఆకులు మరియు చిన్న చిన్న కొమ్మలను తమ గూటికి తీసుకెళ్లడానికి కలిసి పని చేస్తాయి.
వేగంగా ప్రయాణించే జీవుల్లో చీమలు రికార్డ్ సెట్ చేశాయి. ఆప్ట్లీ అనే జాతికి చెందిన చీమలు గంటకు 140 మైల్స్ వేగంతో ప్రయాణిస్తాయి. ఈ వేగంతో అవి గాయపడిన జీవులను వేటాడతాయి. అంటార్కిటికాలో తప్ప ప్రతీ ఖండంలో ఈ చీమలు ఉన్నాయి. మీకో విషయం తెలుసా.. ప్రపంచంలోనే అతి పెద్ద చీమల గూడు 3,700 మైల్స్ ఉంది. అర్జెంటీనాలో ఉంది ఈ గూడు. 5954 కి.మీ. వెడల్పుతో ఉంది. ఈ గూడులో 33 జాతుల చీమలు నివసిస్తున్నాయని అప్పట్లో కనుగొన్నారు. ఇవి చీమల గురించి కొన్ని ఆసక్తికర విషయాలు. మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి.