ఆడపిల్ల అంటే.. ఇప్పటికి భారంగా భావించే తల్లిదండ్రులు ఎందరో ఉన్నారు. కొడుకు పుడితే వారసుడు వచ్చాడని సంతోషపడతారు. ఇక తల్లిదండ్రులు ఎన్ని ఆస్తులు కూడపెట్టినా సరే.. కుమార్తెలకు ఇచ్చేది తక్కువే. స్త్రీ ధనం, వరకట్నం.. పేరు ఏదైనా సరే.. చాలా కొద్ది మొత్తం మాత్రమే ఆడపిల్లకు ఇస్తారు. మిగిలిన ఆస్తి మొత్తం కొడుకులకే ఇస్తారు. కానీ ఆడపిల్లకు కూడా ఆస్తిలో సమాన హక్కు ఉంటుందని 2004లో కోర్టు తీర్పు వచ్చింది. ఇక అప్పటి నుంచి చాలా మంది ఆడవారికి.. పుట్టింటి నుంచి భారీ మొత్తంలోనే ఆస్తులు అందుతున్నాయి. దీనికి ముందు.. కొడుకుకు భారీగా ఆస్తులు ఇస్తారు కాబట్టి.. తల్లిదండ్రులు చేసిన అప్పులు తీర్చే బాధ్యత వారి మీదనే ఉండేది. మరి ఇప్పుడు కుమార్తెలకు కూడా ఆస్తిలో సమాన హక్కు ఇచ్చారు కదా.. మరి ఇప్పుడు కూడా కొడుకులు మాత్రమే తల్లిదండ్రులు చేసిన అప్పులు తీర్చాలా… కుమార్తెలకు ఆ బాధ్యత ఉందా లేదా .. దీని గురించి న్యాయనిపుణులు ఏమంటున్నారంటే..
కుమార్తెలకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చి.. మగ పిల్లలతో సమానంగా ఆస్తి పంపకాలు జరిగితే.. అప్పుల బాధ్యత కూడా సమానంగా తీసుకోవాల్సిందే. అంటే ఆస్తిలో సమాన హక్కు ఉన్నప్పుడు.. అప్పులు తీర్చడంలో కూడా కుమార్తె, కొడుకు సమానంగా పంచుకోవాలి అంటున్నారు న్యాయనిపుణులు. అయితే తల్లిదండ్రులు చేసిన అన్ని అప్పులను పిల్లలు తప్పకుండా తీర్చాలా అంటే.. కాదు అంటున్నారు. తల్లిదండ్రులు చేసే అప్పులు రెండు రకాలుంటాయి. ఇవి వ్యవహారిక, అవ్యవహారిక అప్పులు.
వీటిలో వ్యవహారిక అప్పులు అంటే.. కుటుంబ పోషణ, పిల్లల పెంపకం, చదువులు, పెళ్లిళ్లు వంటి వాటి గురించి తల్లి, తండ్రి అప్పు చేస్తే.. వాటిని చెల్లించాల్సిన బాధ్యత పిల్లలదే. ఇలాంటి అప్పులు తీర్చే విషయంలో ఆడపిల్లలకు సమాన భాగం వర్తిస్తుంది. అలా కాకుండా అవ్యవహారిక అప్పులు అంటే.. జూదం, పేకాట, వ్యభిచారం వంటి కోసం తల్లిదండ్రులు అప్పులు చేస్తే.. వాటిని పిల్లలు తీర్చాల్సిన పని లేదు. కాకపోతే.. అవి అవ్యవాహారిక అప్పులు అని కోర్టులో నిరుపించాలి. అలా నిరూపించగలిగితే.. వాటిని తీర్చే అవసరం పిల్లలకు ఉండదు
ఇక ఇవి కాక.. తల్లిదండ్రులు ఎవరైనా గ్యారంటీగా ఉండి.. నష్టపోయి.. అప్పుల పాలయితే.. అలాంటి వాటిని.. అతడి సంతానం తప్పకుండా తీర్చాలి. ఈ అప్పలు కూడా కుమార్తె, కొడుకుకు సమానంగా వర్తిస్తాయి. అంటే తల్లిదండ్రులు అప్పులు చేసినా.. గ్యారంటీగా ఉండాల్సి వచ్చి.. అప్పుల పాలయితే మాత్రం.. ఆ భారం తప్పకుండా పిల్లల మీద పడుతుంది. కనుక గ్యారంటీగా ఉండకపోవడం ఉత్తమం. ఒకవేళ ఉండాల్సి వస్తే.. ఇక ఆ మొత్తం రాదని నమ్మకం వదిలేసుకోవాలి అంటున్నారు న్యాయనిపుణులు. అలానే అప్పిచ్చే వారు.. ఎలాంటి అవసరాల కోసం అప్పు ఇస్తున్నారో తెలుసుకోవడం మంచిది అంటున్నారు. ఇక ఆడపిల్ల ఆస్తిలో సమాన హక్కు పొందితే.. తప్పుకుండా అప్పుల తీర్చే విషయంలో కూడా సమాన హక్కు వర్తిస్తుంది అంటున్నారు న్యాయ నిపుణులు