ఫోన్ లో సిగ్నల్ లేకపోయినా అత్యవసర కాల్స్ అనేవి వెళ్తాయి. ఇది ఎలా సాధ్యమవుతుంది?
ఫోన్ అనేది ఈరోజుల్లో మనిషి జీవితంలో ఒక భాగమైపోయింది. ‘హమ్ ఖానా నహీ బతుకు సక్తా, మేము అన్నం లేకపోయినా బతగ్గలం. లేకిన్ మొబైల్ నహీ సక్తా బతుకు నహీ’ అన్నట్టు ఉంటారు. ఫోన్ దూరంగా ఉన్న మనుషులతో మాట్లాడడానికే కాదు, దగ్గరగా, పక్కనే ఉన్న మనుషులను దూరం కూడా చేస్తుంది. ఈ ముచ్చట్లు ఎప్పుడూ ఉండేవే కానీ ఫోన్ లాక్ లో ఉన్నప్పుడు అన్ లాక్ సమయంలో ఎమెర్జెన్సీ కాల్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది.దాని మీద క్లిక్ చేస్తే డయల్ ఎస్ఓఎస్ నంబర్ 112 అని వస్తుంది. 112 నంబర్ అంటే పోలీసులకు, అంబులెన్స్ కి, ఫైర్ సిబ్బందికి ఆపద సమయంలో కాల్ చేయడానికి ఉపయోగపడుతుందని మనకి తెలిసిందే. అయితే ఫోన్ లాక్ లో ఉన్నా, ముఖ్యంగా ఫోన్ లో నెట్వర్క్ లేకపోయినా అత్యవసర కాల్ అనేది కనెక్ట్ అవుతుంది. ఇదెలా సాధ్యం? ఎమర్జెన్సీ నెంబర్ ఎలా పని చేస్తుంది అని ఎప్పుడైనా ఆలోచించారా?
ఎవరైనా కాల్ చేసినప్పుడు ఫోన్ ద్వారా సమీపంలో ఉన్న నెట్వర్క్ సర్వీస్ ప్రొవైడర్ టవర్ కి మెసేజ్ చేరుకుంటుంది. ఆ తర్వాత అవతల వ్యక్తికి కాల్ అనేది కనెక్ట్ అవుతుంది. ఈ ప్రక్రియ సెకన్ల వ్యవధిలో జరుగుతుంది. అయితే ఎమర్జెన్సీ కాల్ విషయంలో కూడా ఇలానే జరుగుతుంది. మరి ఫోన్ లో నెట్వర్క్ లేకపోతే ఎలా కలుస్తుంది అంటే వేరే నెట్వర్క్ ద్వారా అన్న మాట. మామూలుగా ఫోన్ లో నెట్వర్క్ ఉంటే ఉచితంగా ఎమర్జెన్సీ కాల్ అనేది కనెక్ట్ అవుతుంది. కానీ నెట్వర్క్ లేనప్పుడు కూడా అత్యవసర కాల్ అనేది కనెక్ట్ అవుతుంది. ఫోన్ లో నెట్వర్క్ లేకపోవడం అంటే మొబైల్ ఆపరేటర్ నుంచి సిగ్నల్ అనేది అందడం లేదని అర్థం.
మొబైల్ ఆపరేటర్ నుంచి నెట్వర్క్ రాకపోతే అందుబాటులో ఉన్న మరో మొబైల్ నెట్వర్క్ ద్వారా ఎమర్జెన్సీ కాల్ అనేది కనెక్ట్ అవుతుంది. వేరే నెట్వర్క్ కి కనెక్ట్ అయ్యింది కదా అని మిగతా వ్యక్తులకు కాల్ చేసుకుందామంటే కుదరదు. ఎందుకంటే కేవలం అత్యవసర కాల్స్ మాత్రమే కనెక్ట్ అవుతాయి. మీ మొబైల్ ఆపరేటర్ వేరే అయినా కానీ మీరున్న ప్రాంతానికి సమీపంలో వేరే మొబైల్ నెట్వర్క్ అయినా గానీ ఏదుంటే దానికి ఎమర్జెన్సీ కాల్ అనేది కనెక్ట్ అవుతుంది. ఆ మొబైల్ నెట్వర్క్ ద్వారా అత్యవసర కాల్స్ వెళ్తాయి. అదన్న మాట విషయం. మీ ఫోన్ లో నెట్వర్క్ లేకపోయినా సమీపంలో ఉన్న నెట్వర్క్ నుంచి ఆ మొబైల్ ఆపరేటర్ ద్వారా కాల్ అనేది కనెక్ట్ అవుతుంది. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.