కోర్టు గురించి మాట్లాడినప్పుడల్లా మేజిస్ట్రేట్, జడ్జి, లాయర్, అడ్వకేట్.. లాంటి పదాలు తరచుగా వినిపిస్తుంటాయి. అయితే, న్యాయమూర్తి, మేజిస్ట్రేట్‌తో పాటు లాయర్, అడ్వకేట్ల మధ్య వ్యత్యాసాలపై ప్రతి ఒక్కరూ కన్ఫ్యూజ్ అవుతుంటారు. వాస్తవానికి చాలా మంది లాయర్ అన్నా.. అడ్వకేట్ అన్నా ఒకటే అనుకుంటారు. ఒక్కటీ కాదు.. రెండింటికీ చాలా తేడా ఉంది. ఆ తేడా ఏంటో తెలియాలంటే ఇది చదివేయండి..
లాయర్, అడ్వకేట్ ఇద్దరూ న్యాయశాస్త్రంలో పరిజ్ఞానం ఉన్నవారే. కానీ, సాధారణ పరిభాషలో లాయర్ అనే పదాన్ని ఎక్కువుగా ఉపయోగిస్తుంటారు. ఎల్ఎల్బి చదివిన వ్యక్తి లాయర్ అంటారు. అలా అని న్యాయశాస్త్రం చదివిన వారందరూ లాయర్స్ అయిపోరు. ఇంకా క్లుప్తంగా అర్థమవ్వాలంటే.. న్యాయశాస్త్రంలో పట్టా పొందేందుకు చదువుతున్న లేదా న్యాయశాస్త్ర పట్టా పూర్తి చేసిన వ్యక్తిని లాయర్ అంటారు. అచ్చ తెలుగులో లేదా ‘న్యాయవాది’ అని పిలవవచ్చు. అంతేకాదు.. న్యాయశాస్త్రంలో శిక్షణ పొందిన ఏ వ్యక్తినైనా న్యాయవాది అని పిలుస్తారు. వీరు కేవలం న్యాయ సలహాలను మాత్రమే ఇచ్చేందు ఆస్కారం ఉంటుంది. వీరు ఎవరి తరఫునా కోర్టులో కేసు వేయలేరు, వాదించలేరు.
అడ్వొకేట్ విషయానికి వస్తే.. న్యాయశాస్త్రం చదివిన తర్వాత కోర్టులో ప్రాక్టీస్ చేసి, వాదనలు వినిపించే వారిని అడ్వకేట్ అంటారు. న్యాయవాదుల చట్టం, 1961 ప్రకారం.. బార్ కౌన్సిల్ పరీక్షకు అర్హత పొందిన న్యాయవాదులు అడ్వకేట్లు. ఇంకా సరళంగా చెప్పాలంటే.. ఒక కేసులో కోర్టులో వాదించే వారు, కేసుపై పోరాడే వారిని అడ్వకేట్ అంటారు. వీరు కోర్టులో కేసు వాదించగలరు. కేసును బట్టి క్లయింట్ తరపున కేసు వాదించడం, నష్ట పరిహారం ఇప్పించడం చేయగలరు.
పైరెండూ విన్నాం.. కానీ, మరి ఇదేంటి అనుకుంటున్నారా! పదవ తరగతిలో వచ్చే బారిస్టర్ పార్వతీశం కాదండోయ్.. ఇది కూడా న్యాయ వృత్తికి సంబంధించిందే. విదేశాల్లో న్యాయవిద్య చదివితే వారిని ‘బారిష్టర్’ అంటారు. బారిస్టర్ కూడా అడ్వకేట్ తో సమానం. అడ్వకేట్ లాగే కేసు టేకప్ చేసి వాదించగలరు. కేవలం పేరు మాత్రమేతేడా. ఉదాహరణకు.. ఇంగ్లాండ్ నుండి న్యాయ పట్టా పొందిన ‘పార్వతీశం’, ‘మహాత్మా గాంధి’ వంటివారు.
ఇప్పుడు అర్థం అయ్యింది కదా! లాయర్‌కి, అడ్వొకేట్ ఒక్కరు కాదని.. ఇద్దరూ వేరు.. వేరు. అలాగే, మేజిస్ట్రేట్, జడ్జి కూడా ఒక్కరు కారు. మేజిస్ట్రేట్ అంటే.. రాష్ట్రం యొక్క జ్యుడీషియల్ అధికారి లేదా నగరం, జిల్లా మొదలైన నిర్దిష్ట ప్రాంతంలో చిన్న కేసులను పరిష్కరించే పౌర అధికారి. న్యాయమూర్తి(జడ్జి) అంటే న్యాయపరమైన అధికారి. కోర్టు కార్యకలాపాలలో పాల్గొంటారు. చట్టపరమైన విషయాలను విశ్లేషించిన తర్వాత తీర్పు ఇస్తారు. అయితే, మేజిస్ట్రేట్ కూడా న్యాయమూర్తి వలె చట్టపరమైన విషయాలను నిర్వహిస్తారు.. కానీ, న్యాయమూర్తికి ఉండే అధికారాలు వారికి ఉండవు. ఈ వార్త ద్వారా మీరు తెలుసుకున్న విషయాలేంటి..? ఈ వార్తపై.. మీ అభిప్రాయం ఏంటి అన్నది? కామెంట్ల రూపంలో తెలియజేయండి.