చదవడం, బాగా చదవడం, అనుకున్న లక్ష్యాలను సాధించేలా చదవడం.. ఇలా చాలా రకాలు. కాకుంటే ఇందులో మన క్యాటగిరీ ఏంటో మనకే తెలియదు. ఇదిగోండి.. ఈ అమ్మాయిని చూడండి. పేరు బాణాల భావన.. పక్కా పల్లెటూరి అమ్మాయి. యూట్యూబ్ లోనే అన్నీ నేర్చేసుకొని అమెజాన్ లో జాబ్ కొట్టేసింది. ఈ రోజుల్లో సాఫ్ట్ వేర్ జాబ్ ఏముందిలే అని మనం అనుకోవచ్చు. కానీ, తను సాఫ్ట్ వేర్ స్కిల్స్ నేర్చుకోవడానికి ఏ ఇన్స్టిట్యూట్ కో వెళ్ళలేదు. యూట్యూల్‌లో చూసి నేర్చుకోని.. వీటిని ప్రాక్టీస్ చేసేందుకు ల్యాప్‌ట్యాప్ లేకపోతే పక్క వారి నుంచి తెచ్చుకొని.. ఇలా చాలా కష్టాలు ఎదుర్కొని ఈ జాబ్ సాధించింది.
భద్రాది కొత్తగూడెం జిల్లా, మణుగురు మండలం, ఏడూళ్ల బయ్యారానికి చెందిన బాణాల శేషిరెడ్డి, లలిత దంపతులకు ఒక కూతురు, ఒక కొడుకు. కూతురు పేరు భావన. ఎకరం పొలమే ఆ కుటుంబానికి ఆధారం. ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడు ఆ ఫ్యామిలీ వెన్నంటే ఉండేవి. ఊళ్లో, ఫ్యామిలీ ఫంక్షన్స్ లో వీరిని చాలా చిన్నచూపు చేసేవారట. ఆ ఫీలింగ్ ఆమెని ఎంతగానో బాధించిందట. అందుకే ఆ చిన్నచూపుని రూపుమాపేంత పెద్దాఫీసరు(సివిల్స్) అయిపోయి ఫ్యామిలీకి పేరు తేవాలని కలలు కనేది. ఈనాడు ఆ కల నిజం చేసింది.
ఇదో తరగతి వరకు తెలుగు మీడియంలో చదివాక.. ఆరో తరగతికి ఇంగ్లీష్ మీడియంలో చేరింది భావన. ఇంగ్లీష్ రాక, చెప్పిన సబ్జక్ట్స్ అర్థమవ్వక మొదట్లో అన్నింటా ఫెయిల్. దీంతో సిక్త్ క్లాస్ రెండు సార్లు చదివిందట. ఇలా ఎలాగోలా పదో తరగతి పాస్. ఇంటర్ కోసం ఖమ్మంకు చేరుకుంది.అక్కడ మొదటిసారి ఇంగ్లీష్‌తో కుస్తీ పట్టడం ఆగి దోస్తీ కుదిరింది. మంచి మార్కులతో ఇంటర్ కంప్లీట్ చేసింది. ఒకానొక సమయంలో కుటుంబ ఆర్థిక పరిస్థితులు చూసి డిగ్రీ చదవాలా వద్దా అని ఆలోచించిందట. సివిల్స్ రాయాలంటే.. డిగ్రీ చేయాలి అని తెలుసుకొని హైదరాబాద్ లో అడుగుపెట్టింది. ఫస్టియర్ పరీక్షలకు రెడీ అవుతుండగా కరోనా రావడం, లాక్‌డౌన్ ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. ఈ సమయమే భావనకు కలిసొచ్చింది.
ఇది కూడా చదవండి: రూ.1.2 కోట్ల జీతం..! ట్రిపుల్ఐటీ చరిత్రలోనే రికార్డు సృష్టించిన విద్యార్థి..!
అందరిలా.. సినిమాలు, ఓటీటీలు, ఫ్యాషన్ వీడియోలకు కాకుండా కంప్యూటర్ ప్రోగ్రామింగ్, స్పోకెన్ ఇంగ్లష్ వీడియోలు చూడటం మొదలెట్టింది. సీ, సీ ప్లస్ ప్లస్, పైతాన్, జావా లాంటి ప్రొగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్ని యూట్యూబ్‌లో చూసి నేర్చుకుంది. డిగ్రీ ఫైనలియర్లో ఉండగానే మల్టీ నేషనల్ కంపెనీలకు ఉద్యోగం కోసం దరఖాస్తు చేసింది. అయితే.. పెద్ద కంపెనీలు స్కిల్స్ లేవంటూ ఇంగ్లీష్ రాదంటూ బిటెక్ చదవలేదంటూ ఆమెకు ఉద్యోగం ఇవ్వడానికి తిరస్కరించాయి. చివరకి అమెజాన్ సంస్థ నుంచి ఇంటర్వ్యూకి రమ్మని పిలుపొచ్చింది. అలా వచ్చిన పిలుపు వరుసగా ఐదు రౌండ్స్ వరకు కంటిన్యూ అయ్యింది. అన్ని రౌండ్స్‌ని కాన్ఫిడెన్స్‌తో పూర్తి చేసింది. చివరకి అమెజాన్ నుంచి మెయిల్ వచ్చింది. ఓపెన్ చేసి చూస్తే యువర్ సెలక్ట్ అంటూ అమెజాన్ ఆఫర్. అంతేకాదు వర్క్ స్టేషన్ లండన్, వార్షిక వేతనం 30,983 యూరోలు (ఇండియన్ కరెన్సీలో రూ. 39.50 లక్షలు). చూశారుగా లక్ష్యాన్ని ఎంచుకొని తన ప్రయాణాన్ని ఎలా సాగించిందో. ఈ అమ్మాయి సాధించిన విజయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.