ప్రతి ఇంట్లో గొడవలు జరగడం సహజం. కానీ కుటుంబ కలహాలు ప్రాణాలు తీసేంతవరకు దారి తీస్తున్నాయి. భార్యాభర్తల మధ్య, తల్లికొడుకు మధ్య, తండ్రికొడుకుల మధ్య ఇలా గొడవలు జరిగి క్షణికావేశంలో ప్రాణాలు తీసేస్తున్నారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలంలో విషాదం చోటు చేసుకుంది.
ఈ మధ్యకాలంలో చాలామంది హత్యలు చేయడానికి వెనకాడటం లేదు. మనిషి ప్రాణాలు తీయడం అంటే మంచినీళ్లు తాగినంత సులభంగా భావిస్తున్నారు. కుటుంబ కలహాలతో క్షణికావేశంలో ఏం చేస్తున్నారో తెలియకుండా పోతుంది. జరిగిన నష్టం జరిగిపోయాక ఏం ఆలోచించి ఏం ప్రయోజనం? తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తన చెల్లెలుతో గొడవపడి ఆవేశంతో సోదరి తలపై రోకలిబండతో మోడి హత్యచేశాడు ఓ అన్న. అసలు గొడవకు కారణం ఏంటీ? ఎలా జరిగింది? ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సీఐ కరుణాకర్ తెలిపిన వివరాల ప్రకారం..
భద్రాద్రి కొత్తగూడె జిల్లా ఇల్లెందు మండలం రాజీవ్‌నగర్‌లో సోమవారం విషాద ఘటన జరిగింది. అజ్మీర సింధు(21), తల్లి, సోదరుడు హరిలాల్ రాజీవ్‌నగర్‌లో నివాసముంటున్నారు. సింధు మహబూబాబాద్‌లో ఏఎస్ఎం అప్రెంటిస్ చేస్తుంది. ఆమె ఎక్కువ టైం సోషల్ మీడియాలోనే గడుపుతుంది. అది నచ్చక సోదరుడు హరిలాల్ చాలాసార్లు మందలించాడు. అయినా తన ధోరణి మార్చుకోకపోవడంతో తరచూ ఇద్దరు గొడవ పడుతూ ఉండేవారు. సోమవారం రాత్రి కూడా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో హరిలాల్ కోపంతో రోకలిబండ తీసుకొని ఆమె తలపై కొట్టడంతో సింధు తీవ్రంగా గాయపడింది. సింధు నిలువునా కుప్పకూలి పోయింది. హుటాహుటిన ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలపడంతో వరంగల్ ఆస్పత్రికి తీసుకెళుతుండగా మధ్యలోనే మృతి చెందింది.
మంగళవారం కుటుంబసభ్యులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండటంతో స్థానికులు అనుమానంతో ఆరా తీశారు. తన చెల్లి రాయి తగిలి చనిపోయిందని హరిలాల్ చుట్టుపక్కల వారిని నమ్మించే ప్రయత్నం చేశాడు. గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల విచారణలో అసలు నిజం బయటపడింది. ప్రస్తుతం హరిలాల్ పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.