పెంపుడు శునకం చూసుకునే వారికి ఏకంగా కోటి రూపాయల శాలరీతో జాబ్ ఆఫర్ ఇచ్చాడు ఓ వ్యక్తి. దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఉద్యోగాలు లేక యువత సతమతమవుతున్న వేళ కుక్కను చూసుకుంటే కోటి రూపాయాల శాలరీ అంటూ జాబ్ ఆఫర్ ఇచ్చాడు.
విశ్వాసానికి మారుపేరైన శునకాన్ని పెంచుకునేందుకు సామాన్యుల నుంచి సంపన్నుల దాక అందరు ఇష్టపడుతుంటారు. శునకాన్ని ఇంట్లో కుటుంబ సభ్యుని మాదిరిగా అన్ని రకాల వసతులు కల్పిస్తారు. దానికి మంచి ఆహారం అందించడం, జబ్బు చేస్తే డాక్టర్ వద్దకు వెళ్లి చూపించడం వంటి సకల వసతులు కల్పిస్తూ ప్రేమగా చూసుకుంటారు. ముఖ్యంగా సెలబ్రిటీలు ఖరీదైన శునకాలను పెంచుకుంటూ వాటికి ప్రత్యేకమైన వసతులను కల్పిస్తారు. ఇటీవల ఓ యువకుడు తన పెంపుడు శునకం కోసం లగ్జరీ వసతులతో ప్రత్యేకంగా ఒ గదిని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇదే రీతిలో ఓ బిలియనీర్ తను పెంచుకుంటున్న శునకాన్ని చూసుకునేందుకు రూ. కోటి శాలరీతో బంపర్ ఆఫర్ ఇచ్చాడు. అంతే కాకుండా ప్రైవేట్ జెట్ లో ప్రయాణించే అవకాశం కూడా కల్పించాడు. దీనికి సంబంధించిన వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
ఉద్యోగాలు రాక నిరుద్యోగం పెరుగుతున్న తరుణంలో ఓ వ్యక్తి తన పెంపుడు శునకాన్ని చూసుకుంటే కోటి రూపాయలు ఇస్తానంటూ చేసిన ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పలు నివేధికల ప్రకారం లండన్ కు చెందిన బిలియనీర్ తన కుక్కను చూసుకోవడం కోసం కోటి రూపాయల శాలరీతో జాబ్ ఆఫర్ ప్రకటించాడు. దీనికోసం ఇప్పటికే మూడు వందలకు పైగా అప్లికేషన్లు వచ్చినట్టుగా తెలిసింది. ఆ జాబ్ కు ఎంపికైన వారు శునకానికి ఆహారం అందించాలి. అది ఏయే ఆహార పదార్ధాలు తీసుకుంటుందో అవగాహన కలిగి ఉండాలి. దానికి స్నానం చేయించాలి, జబ్బు చేస్తే డాక్టర్ వద్దకు తీసుకెల్లాలి. నిత్యం అందుబాటులో ఉంటూ శునకం అవసరాలను చూసుకోవాలి. ఆ విధంగా విధులు నిర్వహించినట్లైతే కోటి రూపాయల జీతం సొంతం చేసుకోవచ్చు. ఉద్యోగానికి ఎంపికైన వారికి ఏడాదికి 42 రోజుల సెలవులు, ఆ శునకాన్ని ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి ప్రైవేట్ జెట్ లో ప్రయాణించే అవకాశం కల్పించనున్నట్లు తెలిసింది. ఇటీవలి కాలంలో పెంపుడు శునకం మరణిస్తే సాంప్రదాయబద్దంగా అంత్యక్రియలు చేసిన సంఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే.