సికింద్రాబాద్ లోని రాంగోపాల్ పేట వాసులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. భయాందోళనతో ఎటు వాళ్లు పరుగులు తీశారు. ఓ అపార్టుమెంట్‌లోని ఇంట్లో భారీ పేలుడు సంభవించింది. భారీ శబ్ధంతో కాంక్రీట్ పెళ్లలు చెల్లాచెదురుగా పడ్డాయి. చుట్టూ దుమ్ము, పొగ కమ్మేశాయి. కాసేపు అక్కడ ఏం జరుగుతోందో కూడా ఎవరికీ అర్థం కాలేదు. ఎటువాళ్లు అటు పరుగులు తీశారు. ఆ పేలుడులో భార్యాభర్తలకు గాయాలు కూడా అయ్యాయి. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. సికింద్రాబాద్‌లోని రాంగోపాల్ పేట పోలీస్ స్టేషన్ పరిధి నల్లగుట్ట జే బ్లాక్‌లో ఈ ప్రమాదం సంభవించింది.
పోలీసులు, స్థానికులు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. నల్లగుట్ట జే బ్లాక్‌లోని ఓ ఇంట్లో భారీ శబ్ధంతో పేలుడు సంభవించింది. కాసేపు అక్కడ ఏం జరుగుతోందో ఎవరికీ అర్థం కాలేదు. వెంటనే స్థానికులు పేలుడు జరిగిన చోటుకు పరుగులు తీశారు. అక్కడ అపార్టుమెంట్‌లోని ఇల్లు పేలుడు ధాటికి పాక్షికంగా దెబ్బతిని ఉంది. స్థానికులు వెళ్లే సరికే భార్యభర్తలు గాయాలతో ఉన్నారు. పోలీసులకు సమాచారం అందించి.. బాధితులను ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకోగానే పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అంబులెన్స్ కోసం ఎదురుచూడకుండా వారిని పోలీస్ వాహనంలో తరలించారు. మార్గం మధ్యలో 108 రాగా అందులోకి మార్చి కిమ్స్ ఆస్పత్రికి పంపారు.
అయితే తొలుత ఈ పేలుడుకు కారణంగా గ్యాస్ సిలిండర్ పేలడమే అనుకున్నారు. సిలిండర్ పేలడంలో ప్రమాదం జరిగినట్లు భావించారు. కానీ, నిజానికి ఇంటి లోపల ఆ ఆనవాలు ఏమీ కనిపించలేదని క్లూస్ టీమ్ చెబుతోంది. అసలు గ్యాస్ సిలిండర్ పేలి ఉంటే పేలుడు ప్రభావం మరింత ఎక్కువగా ఉండేదని చెబుతున్నారు. అసలు పేలుడుకు గల కారణాల ఏమై ఉంటాయనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అపార్టుమెంట్లో ఉండే సీసీటీవీ దృశ్యాలను సైతం పోలీసులు పరిశీలిస్తున్నారు. రాంగోపాల్ పేట అపార్టుమెంట్‌లో పేలుడుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.