హైదరాబాద్ పంజాగుట్టలో ఉన్న నిమ్స్ ఆసుపత్రి చాలా ఫేమస్. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది రోగులు ఈ హాస్పిటల్ కి తరలి వస్తుంటారు. బాగా చికిత్స చేస్తారని ఒక నమ్మకంతో జనం ఇక్కడికి వస్తుంటారు. అలాంటి నమ్మకాన్ని మరింత పెంచేలా వ్యవహరించాల్సింది పోయి నమ్మకం సన్నగిల్లేలా ప్రవర్తించారు ఆ హాస్పిటల్ డైరెక్టర్ మనోహర్. నిమ్స్ హాస్పిటల్ డైరెక్టర్ మనోహర్ చేసిన పనికి నిమ్స్ హాస్పిటల్ ప్రతిష్ట దెబ్బతినేలా ఉందని నిమ్స్ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. దీంతో ఆయన వివాదంలో చిక్కుకున్నారు. నిమ్స్ డైరెక్టర్ మనోహర్ కు ఇటీవల గుండెపోటు రావడంతో ఆయన ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఇదే ఇప్పుడు ఆయన పాలిట వివాదంగా మారింది.
కార్పొరేట్ ఆసుపత్రులను తలదన్నేలా అధునాతన వైద్య సదుపాయాలు, నిపుణులైన వైద్యులు నిమ్స్ లో ఉండగా.. ఆసుపత్రి ఉన్నతాధికారి అయిన మనోహర్ కి ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స చేయించుకోవాల్సిన కర్మ ఏంటని నిమ్స్ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. బాధ్యత గల పొజిషన్ లో ఉన్న ఆయనే ఇలా చేస్తే.. ప్రజలకు నెగిటివ్ సంకేతాలు వెళ్తాయని అంటున్నారు. మనోహర్ తీరుపై ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు మాదివాడ రామబ్రహ్మం మండిపడ్డారు. నిమ్స్ డైరెక్టర్ అనారోగ్యానికి గురయ్యారని మొదట ఆవేదన చెందామని, అయితే ఆయన నిమ్స్ లో కాకుండా కార్పొరేట్ హాస్పిటల్ లో వైద్యం చేయించుకున్నారన్న వార్త తెలిసి దిగ్బ్రాంతికి గురయ్యామని అన్నారు.
ప్రైవేట్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేయించుకోవడం అంటే నిమ్స్ లోని కార్డియాలజీ విభాగానికే కాదు, మొత్తం నిమ్స్ హాస్పిటల్ కి ఇదొక అవమానకరమైన సంఘటన అని అన్నారు. ఎమర్జన్సీ సమయంలో ఇంటికి సమీపంలో ఉన్న కార్పొరేట్ హాస్పిటల్ కి వెళ్లి చికిత్స తీసుకోవడం తప్పు కాదని, అయితే కోలుకున్న తర్వాత కూడా అదే హాస్పిటల్ లో వైద్య సేవలు పొందడం ఖచ్చితంగా నిమ్స్ హాస్పిటల్ ని అవమానించడమే అని అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని వెంటనే నిమ్స్ డైరెక్టర్ మనోహర్ ని తొలగించాలని రామబ్రహ్మం డిమాండ్ చేశారు. మరి ప్రజలకు నమ్మకాన్ని ఇవ్వాల్సిన నిమ్స్ డైరెక్టర్ మనోహర్.. కార్పొరేట్ హాస్పిటల్ లో చికిత్స చేయించుకోవడంపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.