కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు కష్టాలు మొదలయ్యాయని.. కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల అన్నదాతలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని తెలంగాణ మంత్రి కేటీఆర్ విమర్శించారు. మోదీ పాలనతో సామాన్యులు వంటింటికి వెళ్లాలంటే భయపడిపోతున్నారని సిలిండర్లపై రూ.లక్ష కోట్ల సబ్సిడీ ఎత్తి వేశారన్నారు. మోదీ పాలనలో గ్యాస్ సిలిండర్ ధర రూ.వెయ్యి దాటింది. గ్యాస్ సిలిండర్‌ఫై రాయితే ఎత్తివేయడమే అధిక ధరకు కారణం అన్నారు.
ఎక్కడో జరుగుతున్న రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి.. ధరలు పెంచడం ఎక్కడైనా సంబంధం ఉందా అని నిలదీశారు. సామాన్యులకు ఇప్పుడు బతుకంతా భారంగా మారిపోయిందని అన్నారు. ఇప్పుడు సిలీండర్ వెయ్యి అయ్యింది.. మనకు ఇక కట్టెల పొయ్యి దిక్కయ్యింది. ఒక దిక్కు ఆయిల్ రేట్లు పెరిగిపోతున్నాయి.. చమురు ధరల పెరుగుదల కాంగ్రెస్ వైఫల్యమని గతంలో మోదీ అన్నారు.
ఇప్పుడు ఎక్సైజ్ సుంకాన్ని రూ.30కి పెంచి ప్రజల నడ్డి విరిచారు. అప్పట్లో యూపీఏ ప్రభుత్వంపై బీజేపీ నాయకులు ఆందోళన చేశారు.. ఇప్పుడు ధరలు అడ్డగోలుగా పెరిగిపోతున్నాయి.. మరి ప్రజల తరుపు నుంచి బీజేపీ నేతలు పోరాడకుండా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇటీవల రైతులు వరి వేయాలని చెప్పిన బీజేపీ నేతలు దాన్యం కేంద్రం కొనుగోలు చేయాలని ఎందుకు చెప్పడం లేదని అన్నారు. కేంద్రం దాన్యం కొనే వరకు మా పోరాటం ఆగదని అన్నారు.