కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు మరణిస్తే వారి జ్ఞాపకార్థం.. అన్నదానం చేయడం, హాస్పిటల్స్ లో రోగులకు పండ్లు, ఆహారం పంచడం లాంటివి చేస్తుంటారు. అయితే ఇక్కడ ఒక తండ్రి తన కొడుకు జ్ఞాపకార్థం ఏకంగా పెట్రోల్ ని ఉచితంగా దానం చేశాడు. సూర్యాపేటకు చెందిన గండూరి ప్రకాష్ అనే వ్యాపారవేత్త తన కొడుకు ప్రీతం జోనా వర్ధంతి రోజున సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తన కొడుకు జ్ఞాపకార్థం ఉచితంగా పెట్రోల్ ఇస్తున్నట్లు ఆయన ప్రచారం చేయడంతో పెట్రోల్ బంకు దగ్గర జనం భారీగా తరలివచ్చారు. తన కొడుకు ఆత్మకు శాంతి చేకూరాలని ఒక్కో బండిలో లీటర్ పెట్రోల్ పోయించారు ప్రకాష్.మున్సిపల్ శానిటేషన్ వర్కర్స్ కి, దివ్యాంగులకి, కూలి పనులు చేసుకునేవాళ్ళకి, పెయింటర్స్ కి, స్మశాన వాటికల్లో పనిచేసే వారికి ఇలా శారీరక శ్రమ చేసుకునే వారికి 2 లక్షలు ఖర్చుపెట్టి ఉచితంగా పెట్రోల్ దానం చేశారు.
మధ్యాహ్నం వరకూ 1200 మందికి పైగా లక్షా 30 వేల రూపాయల విలువ గల పెట్రోల్ ను ఉచితంగా సరఫరా చేశారు. ఉచితంగా పెట్రోల్ ఇస్తున్నారన్న వార్త బాగా ప్రచారమవ్వడంతో చాలా మంది క్యాన్ లతో బంకు దగ్గరకి వచ్చారు. అయితే నిబంధనలు పెట్టడంతో చాలా మంది వెనుతిరిగారు. ఇప్పటికే తన కొడుకు పేరు మీద ఫౌండేషన్ నిర్వహిస్తున్న ప్రకాష్.. ఉచిత ఆహారం, రోగులకు పండ్లు వంటివి పంపిణీ చేస్తున్నారు. ఈసారి కొంచెం కొత్తగా ఆలోచించి ఫ్రీ పెట్రోల్ ను సామాన్యులకు పంపిణీ చేయాలనుకున్నారు. రోజువారీ కూలీలతో పాటు కొన్ని వర్గాల వారికి ఒక్క రోజయినా ఉచితంగా ఒక లీటర్ పెట్రోల్ కొట్టిస్తే కొంచెంలో కొంచెమైనా ఉపశమనం ఉంటుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. మరి కొడుకు వర్ధంతి రోజున కొడుకు జ్ఞాపకార్థం ఉచితంగా పెట్రోల్ దానం చేసిన తండ్రిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.