సోషల్ మెసేజింగ్ యాప్స్ లో వాట్సాప్ కు మంచి ఆదరణ లభించడమే కాకుండా.. చాలా వేగంగా వృద్ది చెందుతోంది. ఎప్పటికప్పుడు కొత్త అప్ డేట్స్, లేటెస్ట్ వర్షన్స్ తీసుకొస్తూ అటు ఆండ్రాయిడ్, ఇటు ఐఓఎస్ యూజర్ల మెప్పు పొందుతోంది.
వాట్సాప్.. సోషల్ మెసేజింగ్ యాప్స్ లో దీనికి ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. స్మార్ట్ ఫోన్ ఉంటే వాట్సాప్ తప్పనిసరిగా ఉండాలి అనేంతలా ప్రభావం చూపింది. ముఖ్యంగా భారతదేశంలో వాట్సాప్ వినియోగం బాగా పెరిగిందనే చెప్పాలి. ఈ వాట్సాప్ ఎప్పుడూ తమ ఆండ్రాయిడ్, ఐవోఎస్ యూజర్ల కోసం కొత్త కొత్త అప్ డేట్లు తీసుకొస్తూనే ఉంటుంది. దాదాపుగా ప్రతి నెలకి ఒక అప్ డేట్ తెస్తూ ఉంటుంది. ఇప్పుడు తాజాగా ఐవోఎస్ వినియోగదారుల కోసం ఒక లేటెస్ట్ అప్ డేట్ తీసుకొచ్చింది. దాని ద్వారా ఐఫోన్ యూజర్లు ఒక కొత్త ఎక్స్ పీరియన్స్ ని పొందనున్నారు. మరి.. ఆ అప్ డేట్ ఏంటి? ఆ ఫీచర్లేంటో చూద్దాం.
ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ కు ఎంతో గొప్ప ఆదరణ ఉంది. ఆండ్రాయిడ్ యూజర్లు మాత్రమే కాకుండా.. ఐఫోన్ యూజర్లు కూడా వాట్సాప్ ని వినియోగిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఆండ్రాయిడ్ యూజర్లకే ఎక్కవ ఫీచర్లు తీసుకొస్తుందని ఐఫోన్ యూజర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తుంటారు. అయితే ఇప్పుడు ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ ఒక కొత్త అప్ డేట్ తీసుకొచ్చింది. లేటెస్ట్ వర్షన్ కి అప్ డేట్ అయితే ఈ ఫీచర్లు ఐఫోన్ యూజర్లకు అందుబాటులోకి వస్తాయని చెబుతున్నారు. తాజాగా ఐఓఎస్ యూజర్ల కోసం 23.3.77 వర్షన్ అప్ డేట్ తీసుకొచ్చింది. ఈ వర్షన్ ద్వారా సరికొత్త ఎక్స్ పీరియన్స్ ని ఐఫోన్ యూజర్లు పొందుతారంటూ చెబుతున్నారు.
ఈ లేటెస్ట్ వర్షన్ ద్వారా ముఖ్యంగా పిక్చ్ ఇన్ పిక్చర్(PIP) ఫీచర్ ఐఫోన్ యూజర్లకు అందుబాటులోకి రానుంది. అంటే మీరు వాట్సాప్ ద్వారా వీడియో కాల్ మాట్లాడుతున్నప్పుడు వేరే యాప్ ఓపెన్ చేస్తే వీడియో కాల్ పాజ్ అవుతుంది. కానీ, ఇప్పుడు ఈ పీఐపీ ఫీచర్ ద్వారా అలా జరగదు. అయితే ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ వాళ్లకు పరిచయమే.. కానీ, ఐఫోన్ వాళ్ల కోసం తీసుకురావడానికి కాస్త లేట్ అయింది. ఈ ఫీచర్ ని డిసెంబర్ టెస్ట్ చేసి ఐఓఎస్ యూజర్ల కోసం ఇప్పుడు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ ఫీచర్ ద్వారా మీరు కావాలను కుంటే వీడియో కాల్ ని పాజ్ చేయడం, హైడ్ చేయడం కూడా చేయవచ్చు.
అంతేకాకుండా.. ఇప్పటికే ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులో ఉన్న మరికొన్ని ఫీచర్లను ఐఓఎస్ యూజర్ల కోసం అందుబాటులోకి తీసుకొచ్చారు. వాట్సాప్ లో మీరు ఫొటోలు, వీడియోలు పంపే సమయంలో ఎలా అయితే క్యాప్షన్ జోడిస్తారో.. అలాగే ఇప్పటి నుంచి డాక్యుమెంట్స్ సెండ్ చేసే సమయంలో క్యాప్షన్ పెట్టవచ్చు. గ్రూపులకు సంబంధించి డిస్క్రిప్షన్ ని పరిమితి లేకుండా సుదీర్ఘంగా రాసేందుకు వీలు కల్పిస్తున్నారు. ఐఫోన్ యూజర్ల కోసం కూడా అవతార్ ఫీచర్ ని తీసుకొచ్చారు. ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ తరహాలో ఐఓఎస్ యూజర్లు కూడా వాట్సాప్ కి పర్సనలైజ్డ్ అవతార్ ని రూపొందించుకోవచ్చు.