వర్షాకాలంలో లేదా బురద ప్రదేశాల్లో ద్విచక్ర వాహనాల మీద ప్రయాణం చేస్తున్నప్పుడు.. కాళ్ళు కింద పెట్టడం అంటే అసహ్యకరంగా భావించేవాళ్ళు ఉంటారు. కొంతమంది మామూలు సమయంలో కూడా అస్తమానూ కాళ్ళు కింద పెట్టడం ఏంటెహే అని చిరాకు పడుతుంటారు. అసలు కాళ్ళు కింద పెట్టాల్సిన అవసరం లేకుండా స్కూటర్లు తయారు చేయవచ్చు కదా అని ఎప్పుడైనా అనిపించిందా? అయితే మీ అంచనాలను అందుకునే స్కూటర్ ఆల్రెడీ వచ్చేసింది. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు సిగ్నల్ పడినా.. ముందు ఏ వాహనమైనా అడ్డొచ్చినా బండి ఆపి.. కాళ్ళు కింద పెట్టాల్సిన పని లేదు. కాళ్ళు కింద పెట్టకపోతే బండి పడిపోతుంది కద బ్రదరూ అని మీకు డౌట్ వచ్చే ఉంటుంది. అయితే అలా పడిపోకుండా ఉండడమే ఈ స్కూటర్ ప్రత్యేకత. ఇంట్లో బయలుదేరిన తర్వాత స్కూటర్ దిగాలనుకునే వరకూ కాళ్ళు కింద పెట్టాల్సిన పనే ఉండదు. అసలు స్టాండ్ వేయాల్సిన పనే ఉండదు.
లైగర్ మొబిలిటీ అనే స్టార్టప్ కంపెనీ సరికొత్త స్కూటర్ ను తీసుకొచ్చింది. ముంబై ఆధారిత కంపెనీ లైగర్ ఎక్స్, లైగర్ ఎక్స్+ స్కూటర్లను ఆటో ఎక్స్ పోలో ప్రదర్శన ఇచ్చింది. వీటిలో ప్రత్యేకత ఏంటంటే.. ఆటో బ్యాలెన్సింగ్ ఫీచర్ ఉంది. ప్రపంచంలోనే తొలి ఆటో బ్యాలెన్సింగ్ ఎలక్ట్రిక్ వెహికల్ గా ఈ లైగర్ చరిత్ర సృష్టించింది. ఆటో బ్యాలెన్సింగ్ అంటే.. మనం పట్టుకోకపోయినా దానికదే నిలబడుతుంది. స్టాండ్ వేయక్కర్లేదు. స్కూటర్ మీద వెళ్తున్నప్పుడు మధ్యలో ఆగితే కాళ్ళు కింద పెట్టనవసరమూ లేదు. ఎవరి సపోర్ట్ లేకుండా ఇది నిలబడుతుంది. ఇది నిజంగా ఒక గేమ్ ఛేంజర్ కాన్సెప్ట్. ఇది ఎలా నిలబడుతుందో అనే విషయాన్ని లైగర్ మొబిలిటీ కో-ఫౌండర్ వికాస్ పొద్దార్ బయటపెట్టారు.
వాహనం యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీని డైనమిక్ గా మార్చడానికి ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ తో పనిచేసే ఆల్గోరిథమ్స్ ని లైగర్ యూజ్ చేస్తుంది. ఇందులో ఉండే ఆటో బ్యాలెన్సింగ్ ప్రాసెసర్.. వాహనం నుంచి ఒక్క సెకనుకి 9 వేల డేటా పాయింట్లను కలెక్ట్ చేస్తుంది. ఇవి ఆటో బ్యాలెన్సింగ్ యాక్టివేట్ అయినప్పుడు వాహనం అలానే సపోర్ట్ లేకుండా నిలబడేందుకు తోడ్పడతాయి. ఈ డేటా పాయింట్లు అనేవి స్కూటర్ చుట్టూ ఉంచిన వివిధ సెన్సార్లు ద్వారా ఆటో బ్యాలెన్సింగ్ ప్రాసెసర్ చేత కలెక్ట్ చేయబడతాయి. 5 నుంచి 7 కి.మీ. వేగంతో ప్రయాణించినప్పుడు ఈ సెల్ఫ్ బ్యాలెన్సింగ్ ఫీచర్ ఆటోమేటిక్ గా యాక్టివేట్ అవుతుంది. 7 కి.మీ. కంటే వేగంగా ప్రయాణించినప్పుడు ఈ ఫీచర్ ఆటోమేటిక్ గా డీ యాక్టివేట్ అవుతుంది. తక్కువ వేగంతో వెళ్ళినప్పుడు మాత్రమే ఇది యాక్టివేట్ అవుతుంది.
ల్యాబ్ లోనూ, అలానే రియల్ వరల్డ్ కండిషన్స్ లో, వివిధ రోడ్ కండిషన్స్ లో ఈ ఆటో బ్యాలెన్సింగ్ టెక్నాలజీని 10 వేల గంటలకు పైగా పరీక్షించగా సత్ఫాలితాలు వచ్చాయి. మరి దానికదే ఆటోమేటిక్ గా నిలబడే ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఏ విదేశీ కంపెనీయో తయారు చేసిందని అనుకుంటున్నారా? అస్సలు కానే కాదండోయ్. మన స్వదేశమే. మన భారత ఇంజనీర్లే ఈ అద్భుతమైన సృష్టికి బీజం వేశారు. ప్రపంచంలోనే తొలి సెల్ఫ్ బ్యాలెన్సింగ్ టెక్నాలజీ కలిగిన ఈ వాహనాలకు నాంది మన ఇండియానే. ఇదొక్కటే కాదండోయ్.. రివర్స్ మోడ్ ఆప్షన్ కూడా ఉంది. కారుని రివర్స్ చేసినట్టే.. కాళ్ళు కింద పెట్టకుండా కూల్ గా ఈ వాహనాన్ని రివర్స్ లో నడపవచ్చు.
ఈ లైగర్ ఎక్స్, లైగర్ ఎక్స్+ వాహనాలు 2023 ఏడాది చివరి నాటికి కంపెనీ యొక్క ఔరంగాబాద్ ప్లాంట్ లో ఉత్పత్తులను ప్రారంభిస్తామని కంపెనీ ఫౌండర్ వికాస్ తెలిపారు. మొదటి ఏడాదిలో 20 వేల ఆటో బ్యాలెన్సింగ్ వాహనాలను ఉత్పత్తి చేసి.. రెండేళ్లలో లక్ష వాహనాలను ఉత్పత్తి చేస్తామని అన్నారు. ఇక లైగర్ స్కూటర్ బాడీ గురించి చెప్పాలంటే.. ఇది ట్యూబులర్ స్టీల్ ఫ్రేమ్ తో వస్తుంది. ముందు భాగంలో టెలిస్కోపిక్ సస్పెన్షన్, వెనుక భాగంలో డ్యూయల్ స్ప్రింగ్స్ సస్పెన్షన్ తో వస్తుంది. సీటు ఎత్తు 765 ఎంఎం ఉండగా.. 12 అంగుళాల హబ్ మోటార్ తో వస్తుంది. దీని టాప్ స్పీడ్ వచ్చేసి గంటకు 65 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది. ఇందులో లిక్విడ్ కూల్డ్ బ్యాటరీ ప్యాక్ ని అమర్చారు. లైగర్ ఎక్స్ 65 కి.మీ. రేంజ్ తో వస్తే.. లైగర్ ఎక్స్+ 100 కి.మీ. రేంజ్ తో వస్తుంది.
లైగర్ ఎక్స్ లో ఎల్సీడీ డిస్ప్లేని వాడగా.. ఎక్స్+ లో 5 అంగుళాల టీఎఫ్టీ స్క్రీన్ ని వాడారు. ఆటో బ్యాలెన్సింగ్ ఆల్గోరిథమ్స్ ని మెయింటెయిన్ చేయడానికి, అలానే వెహికల్ కంట్రోల్ యూనిట్ ని నిరంతరం ఆప్టిమైజ్ చేయడానికి, ఇతర ఆపరేటింగ్ సిస్టమ్ కి సంబంధించిన వాటిని అప్డేట్ చేయడానికి వీలుగా రెండు వేరియంట్లలో ఓటీఏ అప్డేట్ అనేది ఎనేబుల్ గా ఉంటుంది. ప్రస్తుతం ఈ లైగర్ ఎక్స్ స్కూటర్లలో వాడే సెమీ కండక్టర్లు, లిథియం అయాన్ సెల్స్ ని మన దేశంలో తయారవ్వవు కాబట్టి వేరే దేశం నుంచి దిగుమతి చేసుకుంటున్నామని.. అయితే భవిష్యత్తులో దిగుమతుల మీద ఆధారపడకుండా పూర్తిగా 100 శాతం మన దేశంలో తయారు చేసే దిశగా ప్రయత్నాలు చేస్తామని కంపెనీ ఫౌండర్ వికాస్ అన్నారు. మరి స్టాండ్ అవసరం లేని ఈ లైగర్ ఎక్స్ ఆటో బ్యాలెన్సింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ పై మీ అభిప్రాయమేమిటి కాళ్ళలో చలనం లేని వారికి, కొత్తగా డ్రైవింగ్ నేర్చుకోవాలనుకునే వారికి, ముఖ్యంగా ఆడపిల్లలకు బాగా ఉపయోగపడే ఈ వాహనంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.