అందరి ప్రయాణాలు ముందుగా ప్లాన్ చేసుకుని వెళ్లేలా ఉండవు. కొందరికి నెల రోజుల ముందే ప్లానింగ్ ఉంటే.. కొందరికి అప్పటికప్పుడు ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆ సమయంలో టికెట్లు బుక్ చేసుకోవాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. టికెట్లు దొరికినా బ్యాంకు సర్వర్లు నాకు కొంచెం రెస్టు ఇవ్వురా అంటే ఏమీ చేయలేని పరిస్థితి. ఇక పొరపాటున డబ్బులు ఇరుక్కుపోతే ఏం చేయాలో అర్థం కాదు. ఆ డబ్బులు ఎప్పుడొస్తాయో తెలియదు, మళ్ళీ మన డబ్బులతో టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక టికెట్ క్యాన్సిల్ చేస్తే ఆ డబ్బులు ఎప్పుడు వెనక్కి వస్తాయో తెలియదు. దీనికి చాలా రోజులు పడుతుంది. మరి ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం తీసుకొచ్చింది ఐఆర్సీటీసీ.
భారతీయ రైల్వేస్ లో నిరంతరం కొన్ని లక్షల మంది ప్రయాణాలు చేస్తుంటారు. ఈ ప్రయాణం కోసం అనేక మంది ఎన్నో రోజుల ముందు టికెట్ బుక్ చేసుకుంటారు. అయితే టికెట్ క్యాన్సిల్ చేస్తే ఆ డబ్బులు వెంటనే రావు. కొన్ని రోజులు ఐఆర్సీటీసీ లాక్ అయ్యి.. కొన్ని రోజుల తర్వాత ఖాతాల్లో జమ అవుతాయి. తాజాగా ఈ సమస్యకు పరిష్కారం తీసుకొచ్చింది ఐఆర్సీటీసీ. ఇదే కాదు క్షణాల్లో రైలు టికెట్ ను బుక్ చేసుకునే సదుపాయాన్ని కూడా తీసుకొచ్చింది. నెల రోజుల ముందు టికెట్ బుక్ చేసుకునేవారికి ఎలాంటి సమస్య లేకపోయినా.. అప్పటికప్పుడు తత్కాల్ లోనో, ప్రయాణానికి కొన్ని గంటల ముందు టికెట్ బుక్ చేసుకునేవారికి కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయి. టికెట్ బుక్ చేసుకునే సమయంలో బ్యాంక్ సర్వర్ సారీ బ్రో ఒత్తిడికి గురయ్యాను, బ్రేక్ కావాలి అని అంటే చచ్చింది గొర్రె అన్నట్టు ఉంటుంది పరిస్థితి. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు అక్కడ రైలు టికెట్లు అందుబాటులో ఉన్నా ఇక్కడ బ్యాంకు సర్వర్ హర్రర్ సినిమా చూపిస్తుంటుంది.
ఇక ఈ ప్రాసెస్ లో పొరపాటున డబ్బులు ఇరుక్కుపోతే ఇక అంతే. మళ్ళీ టికెట్ల కోసం డబ్బులు చూసుకోవాలి. ఈ బాధలేమీ లేకుండా క్షణాల్లో రైలు టికెట్లు బుక్ చేసుకోవడం కోసం, అలానే టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే డబ్బులు వెంటనే వెనక్కి రావడం కోసం ఐఆర్సీటీసీ ఇ-వాలెట్ ని తీసుకొచ్చింది. ఇ-వాలెట్ ద్వారా ఎప్పుడైనా క్షణాల్లో టికెట్ బుక్ చేసుకోవచ్చు. బ్యాంక్ సర్వర్ సమస్య ఉండదు. ఎందుకంటే డిజిటల్ వాలెట్ కాబట్టి ముందుగానే ఇందులోకి నగదు లోడ్ చేసుకోవడం జరుగుతుంది. దీని వల్ల ఎలాంటి అంతరాయం లేకుండా టికెట్ వెంటనే బుక్ అవుతుంది. ఒకవేళ టికెట్ క్యాన్సిల్ చేసుకున్నా కూడా డబ్బు వెంటనే వాలెట్ లో చేరుతుంది. కాబట్టి ఇ-వాలెట్ అనేది రైల్వే ప్రయాణికులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇ-వాలెట్ వ్యాలిడిటీ మూడేళ్లు ఉంటుంది. ఆ తర్వాత కూడా కావాలనుకుంటే వ్యాలెట్ ను రెన్యువల్ చేసుకోవచ్చు. దీని కోసం ఎలాంటి ఛార్జీలు ఉండవు.
అదండి మరి విషయం. ఎప్పుడైనా మీరు టికెట్లు బుక్ చేసుకోవాలంటే బ్యాంకు సర్వర్ సమస్య ఉండదు. టికెట్లు వెంటనే బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ టికెట్ క్యాన్సిల్ చేసుకోవాలి అనుకున్నా మీ డబ్బు లాక్ అవ్వదు. వెంటనే మీ వాలెట్ లో జమ అవుతుంది. కాబట్టి ఇ-వాలెట్ ప్రయాణికులకు చాలా సౌకర్యంగా ఉంటుందని చెప్పవచ్చు. మరి భారతీయ రైల్వే తీసుకొచ్చిన ఈ సరికొత్త ఇ-వాలెట్ పై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.