ప్రపంచ అత్యంత ధనికుడిగా మాత్రమే కాకుండా.. ఎలన్ మస్క్ విమర్శలు, విపరీతమైన నిర్ణయాలు వంటి వాటితో కూడా బాగా ఫేమస్ అయ్యారు. ఆయన ట్విట్టర్ ని కొన్న తర్వాత ఆ సంస్థ ఉద్యోగులు రోజుకో విమర్శ, ఆరోపణలతో ముందుకొస్తున్నారు.
ఎలన్ మస్క్.. ఈ పేరు గురించి ప్రపంచవ్యాప్తంగా పెద్దగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఏం చేసినా సెన్సేషన్, కాంట్రవర్సీ అవ్వాల్సిందే. ఆస్తులు పోగొట్టుకోవడంలో కూడా గిన్నిస్ రికార్డు సృష్టించారు. ఈయన ట్విట్టర్ సంస్థను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. మస్క్ ట్విట్టర్ కొన్న తర్వాత చాలానే మార్పులు చేర్పులు చేశారు. చాలా మంది ఉద్యోగులను ఇంటికి పంపారు. ట్విట్టర్ కార్యాలయాలను మూసేశారు. కార్యాలయాల్లో ఉండే సమాగ్రిని అమ్ముకున్నారు. ఇలా చాలానే విషయాలు జరిగాయి. అయితే ఎలన్ మస్క్ కు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని ట్విట్టర్ ఉద్యోగి ఒకరు వెల్లడించారు.
అపర కుబేరుడు ఎలన్ మస్క్ ట్విట్టర్ కొనుగోలు చేసిన తర్వాత ఆయనపై విమర్శలు బాగానే పెరిగాయని చెప్పొచ్చు. “ఎలాన్ మస్క్ ఎప్పుడు ట్విట్టర్ హెడాఫీస్ కి వచ్చినా కూడా సెక్యూరిటీ మధ్యే ఉంటారు. కార్యాలయంలో ఆయన ఎక్కడికి వెళ్లాలి అన్నా కూడా ఆయన చుట్టూ బాడీ గార్డులు ఉంటారు. మీరు హాలీవుడ్ సినిమాల్లో చూసేలా ఎత్తైన, స్ట్రాంగ్ బాడీ గార్డులు ఉంటారు. ఆ కార్యాలయంలో ఆయన బాత్ రూం వెళ్లాలి అన్నా కూడా ఇద్దరు బాడీ గార్డులు ఆయన కూడా ఉంటారు” అంటూ ట్విట్టర్ హెడ్ ఆఫీస్ లో పరిస్థితులను వివరించాడు. ప్రస్తుతం నెట్టింట ఈ ఉద్యోగి చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి.
అంతేకాకుండా.. “ఆయనకు ఉద్యోగులపై నమ్మకం లేదు. అందుకే కార్యాలయంలో కూడా ఉద్యోగుల నడుమ బాడీ గార్డులతో తిరుగుతున్నారు. ఇక్కడ ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. కానీ, ఇప్పుడు పరిస్థితులు అన్నీ మారిపోయాయి. బయట నుంచి చూస్తే ట్విట్టర్ కార్యాలయం బాగానే ఉంటుంది. కానీ, లోపల ఏ వస్తువు పనిచేయదు. ఇక్కడ ట్యాపులు కూడా పని చేయవు” అంటూ ఓ ఇంటర్నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. మరోవైపు ఇలాంటి విమర్శలు, ఆరోపణలు ఏమాత్రం పట్టించుకోకుండా ఎలన్ మస్క్ తనదైనశైలిలో నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తున్నారు.