గాల్లో ఎగిరే కారు.. సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో చూడ్డమే తప్ప నిజ జీవితంలో ఎప్పుడూ చూసింది లేదు. అయితే త్వరలోనే గాల్లో విహరించే కార్లను చూడబోతున్నామని ఆస్కా అనే జపనీస్ కార్ల కంపెనీ వెల్లడించింది. అది కూడా పూర్తిగా విద్యుత్ సాయంతో నడిచే కారులో ఎగరవచ్చని తెలిపింది. ప్రపంచంలోనే తొలి ఎగిరే కారుగా వస్తున్న ఈ కారుని అమెరికాలో ప్రారంభమయ్యే కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షోలో జరగనున్న ప్రదర్శనలో ఉంచుతున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే పలు ఆటోమోటివ్ తయారీ సంస్థలు తమ ఉత్పత్తులను కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షోలో ప్రదర్శించనున్నట్లు ప్రకటించాయి. వీటిలో వోక్స్ వ్యాగన్ కంపెనీ తన కొత్త ఎలక్ట్రిక్ కార్లను ప్రదర్శించనుండగా.. ఆడి కంపెనీ వర్చువల్ రియాలిటీ ద్వారా నడిచే ఎంటర్టైన్మెంట్ డివైజ్ ను ప్రదర్శించనుంది.
వీటితో పాటు ఆస్కా కంపెనీ ఎగిరే కారుని ప్రదర్శించనుంది. దీంతో ఈ ఎగిరే కారుపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. విద్యుత్ తో నడిచే ఈ కారులో లిథియం అయాన్ బ్యాటరీని అమర్చుతున్నట్లు కంపెనీ తెలిపింది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 400 కి.మీ.లు ప్రయాణం చేయవచ్చు. రోడ్డు మీద టాప్ స్పీడ్ 112 కి.మీ. ఉంటుందని, గాల్లో అయితే 240 కి.మీ. ఉంటుందని కంపెనీ వెల్లడించింది. పబ్లిక్ రోడ్ల మీద ఈ కార్లను నడపవచ్చని కంపెనీ వెల్లడించింది. రోడ్డు మీద ఎలక్ట్రిక్ కారుగానే కాకుండా గాల్లో క్వాడ్ క్వాడ్ కాప్టర్ గా ఎగురుతుంది కంపెనీ స్పష్టం చేసింది. మామూలు కారు సైజులో ఉండే ఈ ఎగిరే కారు కోసం విమాన కేంద్రాలు అవసరం లేదు. మిగతా కార్లలానే ఇది కూడా చిన్న స్థలంలో ల్యాండ్ అవ్వగలదు. గ్యారేజ్ లో లేదా వీధుల్లో ఇది సులువుగా ల్యాండ్ అవుతుందని కంపెనీ తెలిపింది.
చిన్న స్థలంలో టేకాఫ్, ల్యాండింగ్ అవ్వడానికి కారణం దీన్ని వర్టికల్ టేకాఫ్ ల్యాండింగ్, షార్ట్ టేకాఫ్ ల్యాండింగ్ కాన్సెప్ట్స్ ఇది నడుస్తుంది. నిలువుగా ఉన్న ప్లేస్ నుంచే ల్యాండ్ మరియు టేకాఫ్ అయ్యేలా ఉంటుంది. దీని వల్ల నేల మీద ఎక్కువ స్పేస్ అవసరం లేదు. రోడ్డు మీద కారులా ఉపయోగించవచ్చు. బోర్ కొడితే గాల్లో ఈజీగా ఎగురుకుంటూ వెళ్లిపోవచ్చు. ఈ ఎగిరే కారులో నలుగురు ప్రయాణికులు కూర్చుని ప్రయాణించేలా ఉంటుందని కంపెనీ తెలిపింది. కారు విశాలంగా ఎస్యూవీ మోడల్ లో ఉంటుంది. ప్రయాణికుల భద్రత కొరకు ఈ కారులో బాలిస్టిక్ పారాచూట్ ఫీచర్ ని అమర్చారు. ఇక దీని ధర సుమారు 5 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
జనవరి 5 నుంచి జనవరి 8 వరకూ 2023 కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షోలో జరగనున్న కార్ల ప్రదర్శనలో ఈ ఆస్కా ఫ్లైయింగ్ కారు నమూనాను కంపెనీ ఆవిష్కరించనుంది. అన్నీ సవ్యంగా జరిగితే 2026లోనే ఈ గాల్లో ఎగిరే కారుని మార్కెట్ లోకి తీసుకొస్తామని కంపెనీ తెలిపింది. ఈ కారు గనుక భారత్ లో అడుగుపెడితే ప్రముఖులకు ట్రాఫిక్ సమస్యలే ఉండవు. అంతేకాకుండా ఈ గాల్లో ఎగిరే కారుని అంబులెన్స్ సేవల కోసం వినియోగిస్తే ఎంతోమంది ప్రాణాలను కాపాడవచ్చు. ముఖ్యంగా ట్రాఫిక్ సమస్యల్లో అంబులెన్స్ ఇరుక్కుపోయే అవకాశం ఉండదు. అప్పుడు ఎగిరే అంబులెన్స్ లని చూడవచ్చు.
ఎగిరే కార్లు రావడానికి మూడేళ్లు సమయం ఉన్నా.. అవి ఇట్టే గడిచిపోతాయి. కాబట్టి ఈ ఎగిరే కార్ల విషయంలో ప్రభుత్వాలు ఎలా ఆలోచిస్తాయో చూడాలి. మరి ఈ గాల్లో ఎగిరే కార్లపై మీ అభిప్రాయం ఏమిటి? ప్రభుత్వాధికారులు, రాజకీయ నాయకులు తమ పర్యటనల కోసం వినియోగించుకుంటే బాగుంటుందా? లేక అంబులెన్స్ లుగా వినియోగిస్తే బాగుంటుందా? లేక రెండిటికీ వినియోగిస్తే బాగుంటుందా? లేక వేరే ఇంకా ఏమైనా ఆలోచనలు ఉన్నాయా? మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.