భారత స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్.. నటి అతియా శెట్టిల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అతియా శెట్టి తండ్రి, బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. సోమవారం మీడియా ముఖంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ‘కేఎల్ రాహుల్ కి ఇప్పుడు నేను అధికారికంగా మావయ్యను అయ్యాను’ అంటూ వ్యాఖ్యానించారు. వివాహం జరిగిన తర్వాత సునీల్ శెట్టి, అతని కుమారుడు అహన్ ఖండాలలో ఉన్న తమ ఇంటికి చేరుకున్నారు. పెళ్లి వేడుక తర్వాత మీడియా మిత్రులందరికీ స్వీట్లు పంచిపెట్టారు. కూతురి పెళ్లి వేడుక సందర్భంగా సునీల్ శెట్టి.. సాంప్రదాయ దుస్తుల్లో దర్శనమిచ్చారు.
ఇక ఐపీఎల్ సీజన్ పూర్తైన తర్వాత రిసెప్షన్ జరుపుతామని సునీల్ శెట్టి వెల్లడించారు. ఈ వివాహ వేడుకకు కేవలం సునీల్ శెట్టికి అత్యంత సన్నిహితులైన కుటుంబ సభ్యులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. వీరిలో కృష్ణ ష్రాఫ్, డయానా పెంటీ, అనుష్క రంజన, ఆదిత్య సీల్ దంపతులు, అన్షులా కపూర్ హాజరయ్యారు. ఇక కేఎల్ రాహుల్ తోటి క్రికెటర్లైన ఇషాంత్ శర్మ, వరుణ్ ఆరోన్ కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. వేడుకకు వెళ్లిన అతిథులు నూతన వధూవరులను ఆశీర్వదించారు. అతియా, కేఎల్ రాహుల్ 2019లో రిలేషన్ ను ప్రారంభించారు. భారత జట్టు 2021లో యూకేలో ఆడినప్పుడు.. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఫోటోల్లో అతియా శెట్టి ఉన్నట్లు వెల్లడైంది. అప్పటి నుంచి వీరి మీద రూమర్లు వచ్చాయి.
ఎట్టకేలకు ఈ రూమర్లను నిజం చేస్తూ ఇవాళ (23/01/2023) ఒకటయ్యారు. వివాహ బంధంలోకి అడుగు పెట్టిన సందర్భంగా.. అతియా శెట్టి, కేఎల్ రాహుల్ దంపతులు తమ సంతోషాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. ‘మీ వెలుగులో నేను ప్రేమంటే ఏంటో నేర్చుకున్నాను. ఈరోజు అత్యంత ప్రియమైన వారి మధ్య.. ఇంట్లో మేము ఒకటవ్వడం అపారమైన ఆనందాన్ని, ప్రశాంతతను కలిగించింది. మేమిద్దరం కలిసి చేయబోతున్న ప్రయాణానికి మీ ఆశీర్వాదాలు కావాలని, ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు’ అంటూ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. మరి వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఈ కొత్తజంటకి విషెస్ తెలియజేయండి.