గతేడాది ఐపీఎల్ సందర్భంగా తన చెల్లెలు చనిపోవడంతో రెండు వారాలు ఒక్కడ్నే గదిలో కూర్చుని ఏడ్చాను అని ఎమోషనల్ అయ్యాడు టీమిండియా స్టార్ క్రికెటర్. ఈ సంఘటన తన జీవితాన్ని అగాథంలోకి నెట్టిందని ఆవేదన వ్యక్తం చేశాడు.
సెలబ్రిటీలు అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది వారి విలాసవంతమైన జీవితమే. అయితే మనం అనుకున్నట్లుగా అందరి సెలబ్రిటీల జీవితాల్లో వెలుగు జిలుగులు ఉండవు. అప్పుడప్పుడు వారి జీవితాల్లో సైతం ఎన్నో కష్టాలను అనుభవించాల్సి వస్తుంది. అలాంటి కష్టాలనే నేనూ అనుభవించాను అని చెప్పుకొచ్చాడు టీమిండియా స్టార్ క్రికెటర్. గతేడాది ఐపీఎల్ సందర్భంగా తన చెల్లెలు చనిపోవడంతో రెండు వారాలు ఒక్కడ్నే గదిలో కూర్చుని ఏడ్చాను అని ఎమోషనల్ అయ్యాడు ఈ స్టార్ బౌలర్. తన జీవితంలో ఎదుర్కొన్న అత్యంత కఠిన పరిస్థితుల గురించి చెప్పుకొచ్చాడు ఈ ఆటగాడు.
ఐపీఎల్ 2023 మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో.. అన్ని ఫ్రాంఛైజీలు సిద్ధం అవుతున్నాయి. ఇక గత కొన్ని రోజులుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టు విరాట్ కోహ్లీ, డివిల్లియర్స్ లతో పాడ్ కాస్ట్ వీడియోలను తీసి, అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని పెంచుతోంది. తాజాగా మరో టీమిండియా స్టార్ బౌలర్ చేత పాడ్ కాస్ట్ వీడియో చేసి విడుదల చేసింది. ఆ బౌలర్ ఎవరో కాదు.. 2021లో పర్పుల్ క్యాప్ సాధించిన స్టార్ బౌలర్ హర్షల్ పటేల్. తాజాగా ఆర్సీబీ నిర్వహించిన పాడ్ కాస్ట్ ప్రోగ్రాంలో తన జీవితంలో ఎదుర్కొన్న కఠిన పరిస్థితుల గురించి చెప్పుకొచ్చాడు హర్షల్ పటేల్.
అతడు మాట్లాడుతూ..”గతేడాది 2022 ఏప్రిల్ 9 న నా సోదరి చనిపోయింది. అప్పుడు నాకు ఏం చేయాలో తోచలేదు. రెండు వారాలు గదిలో ఒక్కడినే కూర్చుని ఏడ్చాను. అప్పుడు నేను వారం రోజులు దాకా క్వారంటైన్ లో ఉండాల్సి వచ్చింది. ఇక అప్పుడు తల్లిని కోల్పోయిన నా మేనల్లుడు, మేనకోడలితో తరచుగా ఫోన్ లో మాట్లాడి ఓదార్చేవాడిని. అయితే నాకు వాళ్ల దగ్గర ఉండి, వారిని హగ్ చేసుకుని గట్టిగా ఏడ్వాలని ఉండేది. కానీ ఏం చేస్తాం పరిస్థితులు అలాంటివి” అని ఎమోషనల్ అయ్యాడు హర్షల్ పటేల్. అయితే తన చెల్లి చనిపోయిన వారం రోజులకే నాకు కొడుకు పుట్టాడని హర్షల్ పేర్కొన్నాడు. ఇక చెల్లి చనిపోయిందని బాధపడాలో లేక కొడుకు పుట్టాడు అని సంతోషపడాలో నాకు తోచలేదు అని హర్షల్ తెలిపాడు.
ఈ రెండు సంఘటనలు నా జీవితంలో ఎంతో మార్పు తెచ్చాయి అని పేర్కొన్నాడు. అయితే జీవితంలో మంచి జరిగినా చెడు జరిగినా రెండింటిని సమానంగా చూడాలని, లైఫ్ లో స్థిరంగా, ధైర్యంగా ఉండాలని హర్షల్ పటేల్ చెప్పుకొచ్చాడు. ఇక ఈ బాధలు అన్ని తన తొలిసారి తనకొడుకును చూసినప్పుడు తొలిగిపోయినట్లుగా అనిపించింది అని అన్నాడు. తనకు సంబంధం లేని విషయాల గురించి, తన నియంత్రణలో లేని విషయాల గురించి పట్టించుకోవడం మానేశానని హర్షల్ వివరించాడు. ఇక 2021లో పర్పులు క్యాప్ సాధించడంతో.. హర్షల్ రేంజ్ మారిపోయింది. 2022 ఐపీఎల్ వేలంలో హర్షల్ ను ఆర్సీబీ రూ. 10 కోట్ల భారీ ధరకు దక్కించుకుంది. ఈ ధర వస్తుందని హర్షల్ సైతం ఊహించలేదట. మళ్లీ ఆర్సీబీకే ఆడాలి అన్న తన కోరిక నెరవేరిందని హర్షల్ చెప్పుకొచ్చాడు.