వన్డే, టెస్ట్, టీ20 ఇలా మూడు ఫార్మాట్లలో ఒక ప్లేయర్ ఆడటం అన్నది చాలా కష్టంతో కూడుకున్నదని అంతర్జాతీయ క్రికెటర్ అయిన బెన్ స్టోక్స్ (బెంజమిన్ ఆండ్రూ స్టోక్స్) తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అన్ని ఫార్మాట్లను ఆడటం అనేది సవాళ్లతో కూడుకున్నదని, ఆ ఒత్తిడిని తట్టుకోవడం కష్టమంటూ ఇటీవల వన్డే క్రికెట్ కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఇంగ్లాండ్ టెస్ట్ టీమ్ కి కెప్టెన్ గా ఉన్న బెన్ స్టోక్స్ నిర్ణయంపై ఆయన అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే అంతర్జాతీయంగా మూడు ఫార్మాట్లతో కూడిన షెడ్యూల్ గందరగోళంగా ఉందని.. అందుకే బెన్ స్టోక్స్ వీడ్కోలు చెప్పాడని ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు పై పలువురు మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పించారు.
తాజాగా ఇంగ్లాండ్ కు చెందిన జానీ బెయిర్ స్టో మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించాడు. క్రికెట్ లో చాలా సవాళ్లు ఉంటాయని, వీలైనంత వరకూ మూడు ఫార్మాట్ల క్రికెట్ ను ఆడేందుకు ప్రయత్నిస్తానని బెయిర్ స్టో వెల్లడించాడు. వేర్వేరు కారణాల వల్ల సమయం వచ్చినప్పుడు కొందరు నిర్ణయం తీసుకుంటూ ఉంటారని, తాను మాత్రం సమీప భవిష్యత్తులో ఫార్మాట్ కు సంబంధించిన ఛాయిస్ ఏంటనేది తీసుకోనని వ్యాఖ్యానించాడు. ఇప్పుడు ఆడుతున్నట్లే ఇక ముందు కూడా టెస్టు, వన్డే, టీ20 ఫార్మాట్లను ఆడుతానని అన్నాడు. అయితే వన్డేలకు వీడ్కోలు సందర్భంగా బెన్ స్టోక్స్ ప్రసంగం ఎంతగానో ఆకట్టుకుందని, అతని నిర్ణయానికి మద్దతు తెలుపుతున్నానని వ్యాఖ్యానించాడు. వ్యక్తిగతంగా తాను మూడు ఫార్మాట్లను ఇష్టపడతానని, ప్రతీ ఒక్కరూ తమకంటూ నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఉంటుందని బెయిర్ స్టో వెల్లడించాడు. వారికున్న సమస్యలను బట్టి ఒక నిర్ణయానికి వస్తారని, అయితే నా వరకూ ఐతే మాత్రం ప్రతీ ఫార్మాట్ ను కొత్తగా భావిస్తానని, అప్పుడే కొత్త జట్టుతో కలిసిపోవచ్చని కామెంట్స్ చేశాడు. కొత్త ఆటగాళ్లతో నూతన ఫార్మాట్ లో ఆడటం తనకెంతో ఉత్సాహం కలిగిస్తుందని బెయిర్ స్టో వెల్లడించాడు.
ఇది కూడా చదవండి: వీడియో: కళ్లు చెదిరే స్టంపింగ్ చేసిన జోస్ బట్లర్.. అచ్చం ధోనీలా!
ఇది కూడా చదవండి: Team Inida: శ్రీలంక సృష్టించిన రికార్డును సమం చేసిన టీమిండియా!