వరల్డ్ కప్ కి ముందు ఇంగ్లాండ్ కి గుడ్ న్యూస్. ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ వన్డేల్లో మరోసారి రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు.
ఈ మధ్య క్రికెట్ లో రిటైర్మెంట్ వెనక్కి తీసుకోవడం చాలా సాధారణంగా మారింది. కెరీర్ కి ఘనంగా వీడ్కోలు పలికిన తర్వాత కూడా కొంతమంది ఆటగాళ్లు తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ ఫ్యాన్స్ కి సర్ ప్రైజ్ ఇస్తూ ఉంటారు. ఒకప్పుడు ఇలాంటివి చాలా అరుదుగా చూస్తూ ఉంటాము. కానీ ప్రస్తుతం నెల వ్యవధిలోనే ముగ్గురు క్రికెటర్లు ఆటకు గుడ్ బై చెప్పి కూడా దేశం కోసం మరోసారి తిరిగి రానుండడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. వీరిలో ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ మొయిన్ ఆలీ, బంగ్లాదేశ్ స్టార్ ప్లేయర్ తమీమ్ ఇక్బాల్ ఇప్పటికే తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోగా తాజాగా ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ వన్డేలో రీ ఎంట్రీకి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది.
ప్రపంచంలోనే బెస్ట్ ఆల్ రౌండర్లలో ఒకడిగా పేరు గాంచిన స్టోక్స్ మరోసారి వన్డేలో కనిపించనున్నాడు. గతేడాది స్వదేశంలో భారత్ తో సిరీస్ తర్వాత స్టోక్స్ వన్డే క్రికెట్ కి వీడ్కోలు పలికాడు. అయితే టీ 20, టెస్టుల్లో మాత్రం కొనసాగుతానని చెప్పాడు. ఈ ఏడాది భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరగనుండడంతో ఇంగ్లాండ్ యాజమాన్యం గత కొన్ని రోజులుగా స్టోక్స్ తో సంప్రదింపులు జరుపుతూ జట్టులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇంగ్లాండ్ వైట్ బాల్ క్రికెట్ కెప్టెన్ బట్లర్ కూడా ఈ స్టార్ ఆల్ రౌండర్ ని ఒప్పించే ప్రయత్నం చేసాడు. తాజాగా వీరి ప్రయత్నాలు సఫలమయ్యాయనే చెప్పాలి. ఇంగ్లాండ్ లోని ప్రముఖ దిన పత్రిక “ది టెలిగ్రాఫ్” స్టోక్స్ తన రిటైర్మెంట్ ని వెనక్కి తీసుకున్నట్లుగా చెప్పుకొచ్చింది. దీనిపై అధికారిక ప్రకటన త్వరలో రావాల్సి ఉంది.
స్టోక్స్ లాంటి స్టార్ ఆల్ రౌండర్ తిరిగి రావడం ఇప్పుడు ఇంగ్లాండ్ టైటిల్ ఫేవరేట్ లో ఒకటిగా మారింది. స్టోక్స్ రాక జట్టులో ఎంతో బలాన్ని పెంచనుంది. ఈ విషయం తెలుసుకున్న ఇంగ్లాండ్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. చివరిసారి 2019 లో ఇంగ్లాండ్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో న్యూజిలాండ్ పై స్టోక్స్ చివరి వరకు పోరాడి ఇంగ్లాండ్ ప్రపంచ కప్ సాధించడంలో కీలక పాత్ర వహించిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు మరోసారి స్టోక్స్ సేవలనను ఇంగ్లాండ్ వాడుకోవాలని చూస్తుంది. అయితే ఈ వరల్డ్ కప్ అనంతరం స్టోక్స్ వన్డే ప్రస్థానాన్ని ముగించనున్నట్లు తెలుస్తుంది. ఇక వన్డే ప్రపంచ కప్ కి జట్టుని ఇంగ్లాండ్ మంగళవారం ప్రకటించనుంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఇంగ్లాండ్ తమ తొలి మ్యాచ్ ని అక్టోబర్ 5 న న్యూజిలాండ్ తో తలపడబోతుంది. మరి ఈ వరల్డ్ కప్ లో స్టోక్స్ ఎంతలా ప్రభావం చూపిస్తాడో చూడాలి. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.