‘బజ్‌బాల్’ అనే పదం పుట్టకముందే.. అంతకుమించిన విధ్వంసంతో వన్డేల్లో రెండు సార్లు ప్రపంచ రికార్డులు నెలకొల్పడంలో కీలక పాత్ర పోషించిన ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
ప్రత్యర్థి బౌలర్లను చీల్చి చెండాడడమే పనిగా.. బంతిని స్టాండ్స్‌లో పడేయడమే పరమావధిగా.. క్రీజులో అడుగుపెట్టింది మొదలు నిర్దాక్షిణ్యంగా బంతిపై విరుచుకుపడే ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్ అలెక్స్ హేల్స్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. చిన్న కెరీర్‌లో పెద్ద ఇంపాక్ట్ చూపిన ఈ 34 ఏళ్ల ఓపెనర్ శుక్రవారం ఆటలోని మూడు ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే జాతీయ జట్టుకు అందుబాటులో ఉండనని వెల్లడించిన హేల్స్.. ప్రపంచవ్యాప్తంగా లీగ్ క్రికెట్‌లో కొనసాగుతానని వెల్లడించాడు. వన్డే క్రికెట్‌లో ఇంగ్లిష్ జట్టు దంచికొట్టడం అనే కాన్సెప్ట్ ప్రారంభించిన తొలినాళ్లలో హేల్స్ వీర విహారం చేశాడు. ఈ క్రమంలో ఇంగ్లిష్ టీమ్ రెండు సార్లు ప్రపంచ రికార్డులు నెలకొల్పడంలో హేల్స్ కీలక పాత్ర పోషించాడు.
గతేడాది టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన హేల్స్.. ఆ తర్వాత జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించలేదు. తుదిపోరులో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన హేల్స్.. సెమీఫైనల్లో టీమిండియాపై మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. భారీ అంచనాలతో బరిలోకి దిగిన భారత్ సెమీఫైనల్లో ఇంగ్లండ్‌తో తలపడగా.. టీమిండియా నిర్దేశించిన లక్ష్యాన్ని (168) ఇంగ్లిష్‌టీమ్ వికెట్ కోల్పోకుండా ఛేదించింది. ఓపెనర్ హేల్స్ 47 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లతో అజేయంగా 86 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. కెరీర్‌లో ఇలాంటి ఎన్నో ఇన్నింగ్స్‌లు ఆడిన హేల్స్.. మైదానం బయట ప్రవర్తనతో పలుమార్లు వార్తల్లో నిలిచాడు. మేనేజ్‌మెంట్‌తో పొసగకపోవడం.. మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌తో విభేదాల కారణంగా హేల్స్ కెరీర్ సాఫీగా సాగలేదు.
జాతీయ జట్టు తరఫున 11 టెస్టులాడిన హేల్స్ 573 పరుగులు చేశాడు. 70 వన్డేల్లో 2419 పరుగులు, 75 టీ20ల్లో 2074 రన్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 7 సెంచరీలు చేశాడు. ‘మూడు ఫార్మాట్లలో కలిపి 156 మ్యాచ్‌ల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించినందుకు గర్విస్తున్నా. ఇంగ్లండ్ తరఫున ఆడటం కంటే అత్యుత్తమ గౌరవం మరొకటి లేదు. అయితే నా కెరీర్‌లో ఎన్నో ఎత్తు పల్లాలు చూశా. వాటిని అధిగమించేందుకు ప్రయత్నించా. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ నాకు దేశం తరఫున చివరిది. ఈ ప్రయాణాన్ని ఎంతో ఆస్వాదించా’ అని హేల్స్ వీడ్కోలు సందేశంలో పేర్కొన్నాడు.
2016లో ఇంగ్లండ్ జట్టు పాకిస్థాన్‌పై ప్రపంచ రికార్డు స్కోరు 444 పరుగులు చేయడంలో హేల్స్ కీలక పాత్ర పోషించాడు. ఆ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన హేల్స్ 171 పరుగులు చేయడంతో ఇంగ్లిష్ జట్టు వరల్డ్ రికార్డు బద్దలు కొట్టింది. ఆ తర్వాత రెండేళ్లకు మరోసారి హేల్స్ భారీ సెంచరీ (147)తో చెలరేగడంతో ఇంగ్లండ్ జట్టు ఆస్ట్రేలియాపై 481 పరుగుల ప్రపంచ రికార్డు నెలకొల్పింది. 2019 వన్డే ప్రపంచకప్ సమయంలోనే డ్రగ్స్ వివాదంలో హేల్స్ పేరు కనిపించడంతో అప్పటి ఇంగ్లిష్ టీమ్ కెప్టెన్ మోర్గాన్ హేల్స్‌ను పక్కన పెట్టేశాడు. ఈ అంశంలో ఇద్దరి మధ్య పలుమార్లు మాటల యుద్ధం జరగగా.. ఆ తర్వాత హేల్స్ ఎప్పుడూ మోర్గాన్ సారథ్యంలో మ్యాచ్ ఆడలేదు.