జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రెసేతర కూటమి స్థాపించే దిశగా పలు రాష్ట్రాల నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్.. ఆదివారం నాటి ప్రెస్ మీట్ లో జాతీయ స్థాయిలో పార్టీ పెడతానని.. దానిలో భాగంగా.. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ సీఎం మమతతో మాట్లాడానని తెలిపారు. తాజాగా ఈ అంశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఫోన్ చేశారు. దీనికంటే ముందే దీదీ.. తమిళనాడు సీఎం స్టాలిన్ కు కూడా కాల్ చేశారు. ఫెడరల్ వ్యవస్థను కాపాడేందుకు చర్చిస్తున్నాం అని దీదీ తెలిపారు. బీజేపీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపై చర్చించినట్లు తెలిపారు.
థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు కోసం దీదీ ఎప్పటినుంచో తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే గతేడాది పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో స్వయంగా ఆమె ఓడిపోవడంతో.. ఈ అంశాన్ని కొద్ది రోజుల పాటు పక్కన పెట్టారు. తాజాగా దక్షిణాది ముఖ్యమంత్రులు స్టాలిన్, కేసీఆర్ బీజేపీ వ్యతిరేక నినాదాలు చేస్తుండటంతో.. దీదీ తాజాగా థర్డ్ ఫ్రంట్ ప్రయత్నాన్ని మరోసారి తెర మీదకు తీసుకువచ్చారు. ఈ బీజేపీయేతర కూటమి ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో చూడాలి. దీదీ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.