ఎమ్మెల్యే గారూ రాజీనామా చేసి ఉప ఎన్నికకు సిద్ధపడండి!
నియోజకవర్గానికి నిధులు వస్తాయి…
ఎమ్మెల్యేలకు తలనొప్పిగా వ్యవహారం…
నియోజకవర్గాల్లో పెరుగుతున్న డిమాండ్లు:
రాజీనామా చేయాలంటూ వస్తున్న డిమాండ్లతో తెలంగాణా ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెరుగుతోంది. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. హుజూరాబాద్ పక్క నియోజకవర్గాల్లోనైతే ఇవి సెగలు పుట్టిస్తున్నాయి. తమ ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయాలంటూ ఉమ్మడి కరీంనగర్లో జిల్లాలోని చొప్పదండి, మానకొండూరు నియోజకవర్గాల్లో పలువు రు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అక్కడక్కడ ఆందోళనలు కూడా చేపడుతున్నారు. కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో ఒత్తిడి కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాజీనామా చేసినవారినే మళ్లీ గెలిపించుకుంటామని హమీ కూడా ఇస్తున్నారు.
కరీంనగర్ ఎమ్మెల్యే, మంత్రి గంగుల కమలాకర్ రాజీనామా చేయాలంటూ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావుకు నియోజకవర్గ ప్రజలపై ప్రేమ ఉంటే రాజీనామా చేయాలంటూ బీజేపీ ఆధ్వర్యంలో దండేపల్లిలో రాస్తారోకో నిర్వహించారు. మంత్రి హరీశ్‌రావుకూ ఈ తలనొప్పి తప్పలేదు.
సిద్దిపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే పదవికి హరీశ్‌రావు రాజీనామా చేయాలని స్థానిక కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని స్థానిక బీజేపీ, కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. సికింద్రాబాద్ ఎమ్మెల్యే జి.సాయన్న రాజీనామా చేయాలంటూ కొందరు రూ పొందించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
ఈ నేపథ్యంలో గోషామహాల్ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని తనపై నియోజక వర్గ ప్రజల నుంచి ఒత్తిడి వస్తోందని రాజాసింగ్ తెలిపారు. నియోజక ప్రజల డిమాండ్‌ను పరిగణలోకి తీసుకుని, గోషామహాల్ అభివృద్ధి కోసం రాజీనామా చేయాలని గట్టి నిర్ణయం తీసుకున్నట్టు రాజాసింగ్ ప్రకటించారు.