టీడీపీలో తీవ్ర విషాదం నెలకొంది. టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు కన్నుమూశారు. గుండెపోటుతో గత కొంతకాలంగా విజయవాడలోని రమేష్ కార్డియాక్ హాస్పటల్లో చికిత్స పొందుతున్న ఆయన.. గురువారం తుదిశ్వాస విడిచారు.
టీడీపీలో తీవ్ర విషాదం నెలకొంది. టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు కన్నుమూశారు. గుండెపోటుతో గత కొంతకాలంగా విజయవాడలోని రమేష్ కార్డియాక్ హాస్పటల్లో చికిత్స పొందుతున్న ఆయన.. గురువారం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల టీడీపీ శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం బచ్చుల అర్జునుడు తెలుగుదేశం పార్టీ గన్నవరం ఇంఛార్జ్‌గా ఉన్నారు.
కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన బచ్చుల అర్జునుడు తెలుగు దేశం పార్టీకి వీరాభిమాని. ఆ మక్కువతోనే ఆయన రాజకీయాల్లోకి అరంగ్రేటం చేశారు. 1995 నుండి 2000 వరకు ప్రైమరీ అగ్రికల్చర్ కో ఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడిగా, 2000 నుండి 2005 వరకు మచిలీపట్టణం మున్సిపాలిటీ ఛైర్మన్‌గా పని చేశారు. ఆ తర్వాత 2014లో కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా నియమితులుయ్యారు. టీడీపీ కేంద్ర కమిటీ క్షమశిక్షణా కమిటీ ఛైర్మన్ గానూ పనిచేశారు. అనంతరం 2017లో శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. కాగా, గత నెల ఆఖరులో బచ్చుల అర్జునుడు గుండెపోటుకు గురయ్యాకు. గమనించిన కుటుంబ సభ్యులు ఆయన్ను విజయవాడలోని రమేశ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతోన్న అర్జునుడు నేడు తుదిశ్వాస విడిచారు.
బచ్చుల అర్జునుడు మరణం పట్ల ఏపీ టీడీపీ నేత అచ్చెన్నాయుడు విచారం వ్యక్తం చేశారు. ‘నిజాయితీ నిబద్దత కలిగిన బచ్చుల మరణ వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని తెలిపారు. అర్జునుడు పార్టీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా కార్యకర్తలకు, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించేవారని వెల్లడించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్దిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి..’ అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.