ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు మరొక ఏడాదిన్నర సమయం మాత్రమే ఉంది. అధికార పార్టీ సహా.. విపక్షాలు సైతం.. ఎన్నికల కోసం రెడీ అవుతున్నాయి. ఈ క్రమంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా స్పీడ్ పెంచారు. ఇప్పటికే రాజకీయాల్లో యాక్టీవ్‌గా మారిన జనసేనాని.. ప్రజా సమస్యలపై దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. ఈసారి ఎన్నికలను కూడా ఆయన సీరియస్‌గా తీసుకున్నారు. ఎన్నికలకు ఏడాది కన్నా ఎక్కువ సమయం ఉండగానే.. పవన్ ఎలక్షన్ మూడ్‌లోకి వెళ్లారు. ఇక ఎన్నికలకు ముందు.. పవన్ బస్సు యాత్రం చేస్తారని గతంలోప్రచారం జరిగింది. కానీ అది వాయిదా పడినట్లు సమాచారం. కానీ పవన్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటనకు సిద్ధమయ్యారు. ఇందుకోసం ఆయన ఓ ప్రత్యేక వాహనాన్ని కూడా సిద్ధం చేసుకున్నారు. దీనికి ‘వారాహి’ అని పేరు పెట్టారు. అంతేకాక హైదరాబాద్‌లో ఈ ప్రచార వాహనం ట్రయల్ రన్‌ను నిర్వహించారు. ప్రస్తుతం వారాహికి సంబంధించిన వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
ప్రస్తుతం ఈ వారాహి వాహనం గురించి రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చించుకుంటున్నారు. ఇక ఈ వాహనానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రత్యేకించి.. దీనిలో స్పెషల్ లైటింగ్.. ఆధునిక సౌండ్ సిస్టమ్స్ అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు ఈ వాహనంలో ప్రత్యేక భద్రతా చర్యలతో పాటూ లేటెస్ట్ టెక్నాలజీతో దీన్ని సిద్ధం చేశారు. గతంలో.. పవన్ కళ్యాణ్ పర్యటనల సమయంలో విద్యుత్ నిలిపివేసిన సందర్భాలను చూశామంటోంది జనసేన పార్టీ. అందుకే వారాహి వాహనంలో ప్రత్యేకంగా లైటింగ్ ఏర్పాట్లు చేశారట. ఈ వాహనం నుంచి పవన్ కళ్యాణ్ ప్రసంగించే సమయంలో లైటింగ్ పరమైన ఇబ్బందులు లేకుండా వాహనం చుట్టూ లైట్లు ఏర్పాట్లు చేశామని దీన్ని తయారు చేసిన వారు తెలిపారు. .
అంతేకాక.. పవన్ ప్రసంగం వేల మందికి స్పష్టంగా వినిపించే విధంగా ఆధునిక సౌండ్ సిస్టం ఏర్పాటుచేశారు. ఈ వారాహికి నలువైపులా సీసీ కెమెరాలు అమర్చారు. వాహనం నిలిపిన చోట.. సభ నిర్వహించే ప్రదేశంలో.. అక్కడి పరిస్థితులు రికార్డయ్యే ఫుటేజ్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సర్వర్‌కి రియల్ టైంలో వెళ్తుంది. అలానే.. 2008 నుంచి ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ పర్యటనల్లో ఎదురైన అంశాలని దృష్టిలో ఉంచుకొని భద్రత చర్యలు తీసుకుని.. ఎంతో ప్రత్యేకంగా దీన్ని తయారు చేసినట్లు తెలిపారు.
అంతేకాదు వాహనం లోపల పవన్ కళ్యాణ్‌తో పాటు మరో ఇద్దరు కూర్చొని చర్చించుకునేలా ఏర్పాట్లు చేశారు. అక్కడి నుంచి హైడ్రాలిక్ విధానంలో మెట్లు ఉంటాయి. వాటి ద్వారా వాహనం మీదకు ఎక్కవచ్చు. ఈ వారాహి వాహనానికి.. జగిత్యాల జిల్లా కొండగట్టు క్షేత్రంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు. ఆ తర్వాతే ఈ వాహనం ప్రజల్లోకి పర్యటనకు వస్తుంది అంటున్నారు.
ప్రస్తుతం ఈ ప్రచార వాహనానికి సంబంధించి వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియోని షేర్ చేస్తూ.. ‘వారాహి’… రెడీ ఫర్ ఎలక్షన్ బ్యాటిల్ అంటూ ట్యాగ్ లైన్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. వారాహి అంటే దుర్గాదేవి సప్త మాతృకల్లో ఒకరు. అందుకే ఈ వాహనానికి అమ్మవారి పేరును నిర్ణయించారు. పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ టీమ్‌తో వారాహి వాహనం వస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
‘Varahi’ is ready for Election Battle! pic.twitter.com/LygtMrp95N
— Pawan Kalyan (@PawanKalyan) December 7, 2022