వైసీపీని ఎదుర్కోవాలంటే పొత్తు పెట్టుకోవాలనేది టీడీపీ, జనసేన ప్రస్తుత సిద్ధాంతం. అయితే సింగిల్ గానే రావాలి అని పదే పదే ప్రతిపక్షాలను రెచ్చగొట్టడం వైసీపీ సిద్ధాంతం. అయితే రెచ్చగొట్టడం మా రాజకీయం అని పైకి కనిపించినా.. అంతర్గతంగా మాత్రం పెద్ద వ్యూహమే ఉంది. ఏదో టైం పాస్ కి ఇలా అనడం లేదు. దీని వెనుక జగన్ మాస్టర్ ప్లాన్ తెలిస్తే దిమాక్ కరాబ్ అవుతుంది.
రాజకీయం అంటే ప్రజలకు మంచి అనిపించే పని చేసుకుంటూ వెళ్లిపోవడమే కాదు.. చెడు అనిపించేది ప్రజలకు తెలియజేయడం కూడా. అధికార పక్షమైనా, ప్రతిపక్షమైనా ప్రజల వద్ద మంచి మార్కులు కొట్టేయాలంటే తాము చేసిన మంచితో పాటు అవతలి వారు చేసే చెడు కూడా చెప్పాలి. దీనికి తోడు అవతలి వారిని ఇరుకున పెట్టాలి. ఈ రాజకీయ సూత్రం జగన్ కి బాగా వంటబట్టిందనే చెప్పుకోవాలి. ప్రజల్లోకి వెళ్లిన ప్రతిసారీ తాను చేసిన మంచి చెప్పడమే కాకుండా.. ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తున్నారు. తాజాగా వైఎస్ జగన్ గుంటూరు జిల్లాలోని తెనాలిలో పర్యటించిన సందర్భంగా ప్రతిపక్షాలకు సవాలు విసిరారు. ఈ సవాలుతో ప్రతిపక్షాలను ఇరుకున పడేశారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం జగన్ తెనాలిలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. రైతులకు మూడో విడత రైతు భరోసా నిధులను విడుదల చేశారు. అలానే ఇటీవల పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మీ బిడ్డ పాలనకు, చంద్రబాబు పాలనకు తేడా గమనించండి. మీకు మంచి చేశాం, మంచి జరిగింది అని అనిపిస్తే మాకు తోడుగా ఉండండి. మీ ఇంట్లో మంచి జరిగిందో లేదో చూసుకోండి అని ప్రభుత్వం చేసిన మంచిని మరోసారి గుర్తు చేశారు. అలానే 175కి 175 నియోజకవర్గాల్లో పోటీ చేసి గెలిచే ధైర్యం ఉందా? అని ప్రతిపక్షాలకు సవాలు విసిరారు. ఒకరకంగా ప్రతిపక్షాలను రెచ్చగొట్టే ప్రయత్నమే చేశారు.
జగన్ కావాలని రెచ్చగొడుతున్నాడు అని ప్రతిపక్షాలు అనుకుంటారని తెలిసినా.. జగన్ మాత్రం తన రాజకీయం ఇంతే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇదంతా దేని కోసం అంటే మళ్ళీ అధికారంలోకి రావడం కోసమే. 2024 ఎన్నికల్లో భాగమే జగన్ అవలంభిస్తున్న వ్యూహం ఇది. జగన్ ప్రతిపక్షాలను రెచ్చగొట్టడం కూడా వ్యూహంలో ఒక భాగమే. టీడీపీ, జనసేన కలిస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలతాయన్న నమ్మకం ప్రతిపక్షాలది. అయితే పొత్తు పెట్టుకున్నా మళ్ళీ వైసీపీనే గెలుస్తుందని జగన్ ధీమా. అది కూడా 175కి 175 స్థానాల్లో గెలుస్తామని చెప్పడం చూస్తుంటే ఎంత కాన్ఫిడెన్స్ తో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. మరి ఆ 175 స్థానాల్లో గెలవాలంటే వ్యూహం అమలు చేయాలి కదా. అందుకే అటు చంద్రబాబుని, ఇటు పవన్ కళ్యాణ్ ని పొత్తు లేకుండా విడివిడిగా పోటీ చేయమని అంటున్నారు. అది కూడా 175 స్థానాల్లో పోటీ చేయమని అంటున్నారు.
ఇప్పుడున్న పరిస్థితిల్లో 175 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టడం అంటే జనసేన పార్టీకి కష్టమే. ఇక టీడీపీ కూడా పొత్తు లేకుండా గెలవలేదన్న భావాన్ని జనాల్లోకి అటు జగన్, ఇటు చంద్రబాబు ఇద్దరూ తీసుకెళ్లారు. దీంతో టీడీపీ కూడా గెలిచే అవకాశం లేదన్న సంకేతాలు ప్రజలకు పంపిస్తూనే.. మళ్ళీ వైసీపీనే వస్తుంది అని నమ్మేలా జనాల మైండ్ సెట్ ని జగన్ ట్యూన్ చేస్తున్నారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అందుకే పదే పదే పొత్తు పెట్టుకోకుండా సింగిల్ గా రండి అని అటు జగన్ గానీ, ఇటు వైసీపీ నేతలు గానీ అనేది. చూడ్డానికి జగన్ రెచ్చిపోతున్నట్టు కనిపిస్తున్నా.. బాగా అబ్జర్వ్ చేస్తే అది రెచ్చగొట్టడం అని అర్ధమవుతుంది. ప్రతిపక్షాల ఈగోని టచ్ చేస్తేనే, ఆ ఈగోని రెచ్చగొడితేనే వాళ్ళు పొత్తు లేకుండా విడివిడిగా పోటీ చేస్తారనేది జగన్ ఆలోచన. అదే జరిగితే మళ్ళీ జగన్ కే ప్లస్ అవుతుందని నమ్మకం. కాబట్టి రెచ్చగొట్టడం జగన్ స్ట్రాటజీ, మా రాజకీయం అని జగన్ చెప్పకనే చెబుతున్నారు. మరి ప్రతిపక్షాలు దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటాయో చూడాలి. మరి జగన్ వ్యూహంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.