జగన్ కు రాజకీయంగా అనుభవం లేదని.. అవగాహన లేదని వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో నేతలకు అసంతృప్తి ఉందని కామెంట్స్ చేశారు.
జగన్ రాజకీయ అనుభవం 19 ఏళ్ళు. చంద్రబాబు లాంటి సీనియర్ నాయకులతో పోలిస్తే ఈ అనుభవం తక్కువే. అయినప్పటికీ ప్రజల్లో విపరీతమైన ఆదరణ ఉంది. అదే సమయంలో సొంత పార్టీలో నేతలే అసంతృప్తిగా ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. జగన్ కు రాజకీయ అనుభవం లేదని, అవగాహన లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తుంటాయి. సొంత పార్టీ నుంచి అసంతృత్తితో బయటకు వచ్చిన నేతలు కూడా ఇదే చెబుతుంటారు. సొంత నాయకులపై కూడా జగన్ కు అవగాహన లేదని విమర్శలు చేస్తున్నారు. తాజాగా సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యే కూడా ఇవే కామెంట్స్ చేశారు. జగన్ కు రాజకీయ అనుభవం, అవగాహన లేవని అన్నారు.
పార్టీ కార్యకర్తలు, నాయకులు అసంతృప్తితో ఉన్న మాట వాస్తవమే అని, రాష్ట్రమంతా ఆ విషయం తెలుసునని ఆదోని నియోజకవర్గ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అన్నారు. ఎందుకంటే జగన్ కి ముఖ్యమంత్రిగా అనుభవం రావాలంటే ఐదేళ్లు పడుతుందని, ఐదేళ్లు పూర్తయితే పూర్తి స్థాయిలో అవగాహన వస్తుందని అన్నారు. ఎవరు ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలా? ఏ విధంగా పార్టీ క్యాడర్ ని పైకి తీసుకురావాలా అని పార్టీ నాయకులంతా ఆలోచించాలని అన్నారు. జగన్ నాలుగేళ్ల పరిపాలన మీద ఎవరూ అసంతృప్తి చెందే అవసరం లేదని అన్నారు. ఏది ఏమైనా కానీ.. ఓట్లు వేసి గెలిపించారు కాబట్టి సాధ్యమైనంత వరకూ మేమున్నామని అందరం అండగా నిలబడాలని అన్నారు.
మా వంతుగా ఏ కష్టమొచ్చినా ఆదుకుంటాం. ఎవరినీ వదిలిపెట్టం అని అన్నారు. మొన్న జగన్ కూడా మీటింగ్ లో.. ఎమ్మెల్యేలను గానీ, కార్యకర్తలను గానీ, నాయకులను గానీ వదిలే ప్రసక్తి లేదని అన్నారు. కాబట్టి మళ్లీ ఎన్నికల్లో కూడా జగన్ ముఖ్యమంత్రి అయ్యేందుకు అందరం కృషి చేయాలని ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి అన్నారు. జగన్ కి అవగాహన రావాలంటే ఇంకో ఏడాది పడుతుందని, అసంతృప్తి చెందే పని లేదని సాయి ప్రసాద్ రెడ్డి అన్నారు. ఆయన మళ్ళీ సీఎం అయితే మన గురించి ఆలోచిస్తారని, మీటింగులో కూడా అదే చెప్పారని అన్నారు. మరి వైసీపీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.