టీడీపీ యువనేత నారా లోకేష్ ప్రారంభించిన యువగళం పాదయాత్ర విజయవంతంగా ముందుకు సాగుతోంది. అయితే త్వరలోనే పాదయాత్రకు బ్రేకులు పడనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ వివరాలు
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తెలుగుదేశ పార్టీ యువనేత నారా లోకేష్ యువగళం పేరిట సుదీర్ఘ పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. 400 రోజుల పాటు.. రాష్ట్రవ్యాప్తంగా 4 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయాలని నారా లోకేష్ బలమైన సంకల్పంతో ముందడుగు వేస్తున్నారు. పాదయాత్ర ప్రారంభమై నేటికి 15 రోజులు. స్పందన కూడా బాగానే ఉంది. యువత, రైతులు, నిరుద్యోగ సమస్యలపై లోకేష్ తన గళం వినిపిస్తున్నాడు. వారి సమస్యలు తెలుసుకుంటూ పాదయాత్రలో ముందుకు సాగుతున్నారు. అయితే త్వరలోనే లోకేష్ పాదయాత్రకు బ్రేకులు పడనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకు అంటే..
వచ్చే నెల అనగా మార్చిలో ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి షెడ్యూల్ విడుదల అయ్యింది. స్థానిక సంస్థలు, పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ క్రమంలో ఇటు అధికార పక్షం నిర్వహిస్తోన్న గడపగడపకు మన ప్రభుత్వం.. అటు విపక్ష నేత నారా లోకేష్ నిర్వహిస్తోన్న యువగళం పాదయాత్ర కొనసాగింపుకు బ్రేకులు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చిత్తూరు కలెక్టర్ హరినారాయణన్.. గడపగడపకు, యువగళం కొనసాగింపుపై స్పష్టత కోరుతూ.. ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనాకు లేఖ రాశారు.
కేంద్ర ఎన్నికల సంఘం ఏపీలో నిర్వహించాల్సిన ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేయడంతో.. ఈ ఎన్నికలు జరిగే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దాంతో చిత్తూరు జిల్లా కలెక్టర్ హరినారాయణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంతో పాటు.. నారా లోకేష్ యువగళం పాదయాత్ర కొనసాగింపుపై రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని స్పష్టత కోరారు. మరి ఎస్‌ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో లోకేష్ పాదయాత్రకు బ్రేకులు పడతాయని మీరు భావిస్తున్నారా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.