తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి కన్ను మూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న బొజ్జల.. హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. ఆయన తెదేపా అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు. శ్రీకాళహస్తి నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉమ్మడి ఏపీలోను, విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ లోనూ మంత్రిగా పనిచేశారు.
రాజకీయ ప్రస్థానం:
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఊరందూరు గ్రామంలో 1949 ఏప్రిల్ 15న బొజ్జల గోపాల కృష్ణా రెడ్డి జన్మించారు. తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం హైదరాబాద్ వచ్చి లాయర్ గా జీవితం ప్రారంభించారు. ఈక్రమంలో బొజ్జల.. ఎన్టీఆర్ పిలుపు మేరకు రాజకీయ రంగ ప్రవేశం చేశారు. శ్రీకాళహస్తి నుంచి 1989లో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం 1994,1999,2009,2014లో వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రోడ్డు రహదారులు, భవనాల, శాస్త్ర సాంకేతిక శాఖలతో సహా వివిధ శాఖలకు కృష్ణారెడ్డి మంత్రిగా పనిచేశారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో తెదేపా తరపు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. మధ్యలోఅనారోగ్యం కారణంగా చంద్రబాబు క్యాబినేట్లో చోటు కోల్పోయారు. బొజ్జల గోపాలకృష్టారెడ్డి తెదేపా అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. దాదాపు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతిసారీ బొజ్జల మంత్రిగా కొసాగారు.
2003 అక్టోబరు 1న తిరుపతి బ్రహ్మొత్సవాలకు వెళుతున్న సమయంలో అలిపిరి వద్ద నక్సలైట్లు బాంబు పేల్చి చంద్రబాబు నాయుడిపై హత్యాప్రయత్నం చేశారు. ఈ సంఘటనలో ఆనాడు రాష్ట్ర సమాచారశాఖ మంత్రి ఉన్నా బొజ్జల కూడా గాయపడ్డారు. బొజ్జలకు తెలంగాణ సీఎం కేసీఆర్, తుమ్మల నాగేశ్వరావు , సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మంచి సన్నిహితులు. 2004-2014 మధ్య టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బొజ్జల, ముద్దు కృష్ణమ నాయుడు కీలకంగా వ్యవహరించారు. అందుకే వీరిద్దరని చిత్తూరు బ్రదర్స్ అంటూ పార్టీ నేతలు పిలిచేవారు. బొజ్జల మృతిపై తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరి.. ఇంతలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన బొజ్జల గోపాలకృష్ణా రెడ్డిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.