ఆంధ్రప్రదేశ్ లో రఘురామ కృష్ణరాజు అరెస్ట్ ప్రకంపనలు రేపుతోంది. నర్సాపురం నుండి వైసీపీ ఎమ్మెల్యేగా నిలిచిన రఘురామ ఎన్నడూ ఆ పార్టీ పట్ల విధేయత చాటుకోలేదు. పార్టీకి పక్కలో బల్లెంల వ్యవహరిస్తూనే వచ్చారు. కానీ.., ఇన్ని రోజులు ఈ విషయంలో మౌనం వహిస్తూ వచ్చిన జగన్ సర్కార్ మొదటిసారి ఆయనపై సిఐడి అస్త్రాన్ని సంధించింది. బెయిల్ రావడం కూడా చాలా కష్టమైన సెక్షన్స్ కింద ఆయన్ని అరెస్ట్ చేసి తమ పంతాన్ని నెగ్గించుకుంది. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో రఘురామరాజుపై ఐపీసీ- 124 ఏ సెక్షన్ కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. అయితే.. ఆయనపై సీఆర్ పీసీ 50 (2) ప్రకారం నోటీసులు జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు. కానీ.., రఘురామ కృష్ణరాజు అరెస్ట్ తరువాత జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు తీవ్ర చర్చకి కారణం అవుతున్నాయి. సీఐడీ దర్యాప్తులో ఎంపీని కొట్టారన్న వాదన సంచలనం సృష్టిస్తోంది. రఘురామ మోషన్ పిటీషన్ ని హైకోర్టు డిస్మిస్ చేసి, సిఐడి కోర్టులోనే తేల్చుకోవాలని చెప్పిన విషయం తెలిసిందే. దీనితో రఘురామరాజుకి రిమాండ్ వేస్తారని అంతా అనుకున్నారు.కానీ.. ఆయన శనివారం సరిగ్గా 5 గంటలకు ఆయన సిఐడి కోర్టుకు రాగానే అసలు విషయం బయట పడింది. అక్కడ ఉన్న తన న్యాయవాదులకు, తనని పోలీసులు కొట్టిన దెబ్బలు చూపించారు రఘురామ. దీంతో ఒక్కసారిగా పరిణామాలు మారిపోయాయి. వెంటనే మళ్ళీ హైకోర్టుకు వెళ్ళారు లాయర్లు. ప్రాధమిక సాక్ష్యాలుగా ఆయనకు తగిలిన గాయాలు చూపించి, కేసు తీవ్రతను తెలియ చేయటంతో, డివిజినల్ బెంచ్ ఏర్పాటు అయ్యింది. దీంతో స్పెషల్ మోషన్ మూవ్ చేసారు రఘురామ రాజు తరుపు న్యాయవాదులు. ఈ సందర్భంగా రఘరామరాజుకి తగిలిన మరికొన్ని గాయాలను, డివిజనల్ బెంచ్ ముందు పెట్టారు. ఆ ఫోటోలు చూసిన న్యాయస్థానం కూడా షాక్ అయ్యింది. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏమి జరుగుతుంది అంటూ ప్రశ్నించింది. పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తిని ఎలా కొడతారంటూ అంటూ కోర్టులు తీవ్ర ఆగహ్రం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే రఘురామ కృష్ణరాజు కోసం ముగ్గురు డాక్టర్లతో ఒక మెడికల్ బృందాన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈయనకి గుంటూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో ఇందుకు సంబంధించిన ట్రీట్మెంట్ జరుగుతుంది. రఘురామ కాలిపై ఉన్న గాయాలు పోలీసులు కొట్టినవే అని తేలితే మాత్రం ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తప్పకపోవచ్చన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.