ప్రభుత్వ స్కూళ్లలో టెన్త్ పాస్ అయిన విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. విద్యార్థుల్లో బాగా చదవాలనే తపనను పెంచే ఉద్దేశంతో ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది.
మన దేశంలో ఒకప్పుడు దాదాపుగా అందరూ ప్రభుత్వ స్కూళ్లలోనే చదువుకునేవారు. అక్కడ విద్యా బోధన ఎంతో బాగుండేది. ఎంతో అనుభవం ఉన్న ఉపాధ్యాయులు పాఠాలు చెప్పేవారు. విద్యార్థులకు చదువుతో పాటు క్రమశిక్షణ కూడా నేర్పించేవారు. ఆటపాటల్లో కూడా పిల్లలు చురుగ్గా ఉండేలా చూసేవారు. అందుకే ఏ సర్కారు బడి చూసినా పిల్లలతో నిండిపోయి కనిపించేది. ఇప్పుడు సాఫ్ట్వేర్, పాలిటిక్స్, బిజినెస్, స్పోర్ట్స్, సినిమా రంగాల్లో అత్యున్నత స్థానాల్లో ఉన్న చాలా మంది ప్రముఖులు ఒకప్పుడు ప్రభుత్వ బడుల్లో చదువుకున్న వారే. అయితే ప్రైవేటు స్కూళ్ల ఎంట్రీ అంతా మారిపోయింది. మెరుగైన భవిష్యత్ కోసం పిల్లలను ఎంత ఖర్చయినా పర్లేదనుకొని ప్రైవేటు స్కూళ్లలో చేర్పిస్తున్నారు పేరెంట్స్. ప్రైవేటు స్కూళ్లకు డిమాండ్ పెరగడంతో ప్రభుత్వ స్కూళ్లలో చదువుకునే వారి సంఖ్య బాగా తగ్గింది.
పేద, దిగువ మధ్య తరగతికి చెందిన పిల్లలే సర్కారు బడుల్లో ఎక్కువగా చదువుకుంటున్నారని నిపుణులు అంటున్నారు. అయితే మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంపై సీరియస్గా దృష్టి సారిస్తున్నాయి. సర్కారు బడుల్లో మౌలిక వసతుల కల్పన, టెక్నాలజీ వాడకంతో విద్యార్థుల శాతాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ప్రభుత్వ స్కూళ్లలో చదివి పదో తరగతిలో మంచి మార్కులు సాధించిన వారికి ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్ర, జిల్లా స్థాయిలో టాప్-3 స్టూడెంట్స్కు రూ.లక్ష, రూ.75 వేలు, రూ.50 వేలు ఇస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. జిల్లా స్థాయిలో విద్యార్థులకు రూ.50 వేలు, రూ.30 వేలు, రూ.10 ఇస్తామని వెల్లడించారు. అలాగే నియోజకవర్గాల్లో తొలి మూడు స్థానల్లో నిలిచిన వారికి రూ.15 వేలు, రూ.10 వేలు, రూ.5 వేల చొప్పున నగదును ప్రభుత్వం అందజేయనుంది.