ఏపీ ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించాలంటూ రైతులు చేపట్టిన మహా పాదయాత్ర ముగిసింది. న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు 45 రోజులు 450 కిలోమీటర్లు మేర ఈ పాదయాత్ర సాగింది. తిరుపతిలో ఈ పాదయాత్ర ముగింపు సభలో ప్రతిపక్ష నేత చంద్రబాబు సహా పలు రాజకీయ పార్టీలు పాల్గొన్నాయి. ఈ సభలో చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. దద్దమ్మ ప్రభుత్వం అంటూ విమర్శించారు. రైతులు చేసిన పాపం ఏంటని ప్రశ్నించారు.
‘మడమ తిప్పనన్న జగన్ అమరావతి రాజధాని విషయంలో మడమతిప్పారు. అమరావతిలో రాజధాని పెడితే మునిగిపోతుంది అన్నారు. ఈ మూడేళ్లలో ఎప్పుడైనా మునిగిందా? నేల గట్టిది కాదన్నారు. హైదరాబాద్ కంటే గట్టి నేల అంటూ చెన్నై ఐఐటీ నిపుణులు తేల్చారు. ఇన్ సైడ్ ట్రేడింగ్ ఆరోపణలు చేశారు. వాటిని సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. అమరావతి ఉద్యమం మొదలైనప్పపటి నుంచి 180 మంది రైతులు మరణించారు. 2,500 మంది రైతులపై కేసులు నమోదు చేశారు. ఎస్సీ, ఎస్టీలపైనే అట్రాసిటీ కేసులు పెట్టిన దద్దమ్మ ప్రభుత్వం వైసీపీ. అమరావతిపై ఇప్పిటకే రూ.10 వేల కోట్లు ఖర్చు చేశాం. అమరావతిలో రాజధాని కట్టేందుకు డబ్బు లేదంటున్నారు. అమరావతి భూములపైనే డబ్బు సృష్టించవచ్చు’ అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు.
‘అమరావతికి కులం అంటగట్టారు. ఇక్కడికి వచ్చిన వారందరిదీ ఏ కులం? హైదరాబాద్ అనుభవం ఉందని పంట భూములు తీసుకున్నాం. ఎన్నికలకు ముందు ఏం చెప్పారు? రాజధానిగా అమరావతి ఉండాలంటూ చెప్పుకొచ్చారు. ఇప్పుడు మాట మార్చారు. రాజధానిగా అమరావతే కొనసాగుతుందని జనసేన నేత పవన్ కల్యాణ్ కూడా చెప్పారు. ఆయన కూడా రాజధాని రైతుల ఉద్యమాలకు మద్దతు తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలు అమరావతి రైతుల కోసం పోరాడుతున్నాయి. ధర్మ పోరాటంలో అంతిమ విజయం మనదే. జగన్ ఇష్టానుసారం చేస్తే కుదరదు’ ప్రతిపక్షనేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఏపీ రాజధానిగా అమరావితనే కొనసాగిస్తారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.