టమాటా రైతులు కోటీశ్వరులైపోతున్నారు. ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి టమాటా పండించిన రైతులకు లాభాలు దక్కుతున్నాయి. దీంతో లక్షాధికారులు, కోటీశ్వరులు అయిపోతున్నారు.
గత కొద్ది రోజులుగా జోరుగా వినిపిస్తున్న మాట టమాటాల రేట్లు. గతంలో ఎప్పుడు లేనంతగా టమాటా ధరలు కొండెక్కి వినియోగదారలకు చుక్కులు చూపిస్తుంటే, టమాటా పండించిన రైతులకు మాత్రం సిరులు కురిపిస్తున్నాయి. పంట దిగుబడి కావాల్సిన డిమాండ్ కన్నా తక్కువగా ఉండడంతో కిలో టమాటా రూ. 150 నుంచి రూ. 200 వరకు పెరిగిపోయింది. దీంతో కష్ట పడి టమాటా సాగు చేసిన రైతులు రోజుల వ్యవధిలోనే కోటీశ్వరులుగా మారిపోయారు. దీంతో టమాటా రైతు కుటుంబాలు ఆనందంలో మునిగి తేలుతున్నాయి. దేశంలోని పలు రాష్ట్రాల టమాటా రైతులు ఊహించని రీతిలో లక్షలు, కోట్లు సంపాదిస్తూ లగ్జరీ ఇండ్లు, వాహనాలను సొంతం చేసుకుంటున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
ఆరుగాలం శ్రమించిన టమాటా రైతుకు ఫలితం దక్కింది. సాధారణ రోజుల్లో 20 కిలోల టమాటా బాక్స్ రూ. 300 పలికితే ఇప్పుడు మాత్రం ఏకంగా రూ. 2000 వరకు పలుకుతూ రెట్టింపు ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. కర్ణాటకలోని జలబిగానపల్లికలి చెందిన టమాటా రైతు అరవింద్ తన 5 ఎకరాల పొలంలో టమాటా సాగు చేశాడు. మంచి దిగుబడి వచ్చి అదే సమయంలో రేటు పెరగడంతో టమాటాలను అమ్మగా రూ. 1.4 కోట్లు ఆదాయాన్ని సంపాదించాడు.
దీంతో రైతు అరవింద్ అంగన్‌వాడీ వర్కర్ గా పనిచేస్తున్న తన తల్లికి బహుమతిగా లగ్జరీ ఇల్లు కొంటున్నారు. మరో రైతు తెలంగాణలోని పులుమామిడి గ్రామానికి చెందిన అనంత్ రెడ్డి ఎకరం భూమిలో టమాటా సాగు చేసి రూ. 20 లక్షలు ఆదాయాన్ని పొందాడు. ఆ డబ్బుతో అతడు ఓ కొత్త ట్రాక్టర్ ను, లక్షలు విలువ చేసే హ్యుందాయ్ వెన్యూ కారును కొన్నారు. ఈ విధంగా టమాటా రైతులు భారీ ధరల కారణంగా ఊహించని లాభాలను ఆర్జిస్తూ సంపన్నుల జాబితాలో చేరిపోతున్నారు.