ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి రాజకీయం నడిచినా.., మళ్ళీ ఎన్నికల వరకు జగన్ ప్రభుత్వానికైతే డోఖా లేదు. 2019 ఎన్నికలో వైసీపీకి ప్రజలు అంతటి ఆధిక్యాన్ని కట్టబెట్టారు. ఆ పార్టీ 151 సీట్లు గెలవడంలో ప్రధాన కారణం మాత్రమే కాదు.., ఒకే ఒక్క కారణం కూడా వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి. పాదయాత్ర ద్వారా ప్రజలకి దగ్గరైన ఆయన ఒంటి చేత్తో పార్టీని అధికారంలోకి తెచ్చుకోగలిగాడు. కానీ.., పార్టీ ఏర్పడ్డ తరువాత కూడా వైసీపీ లో ఈ వన్ మ్యాన్ షో నడుస్తోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పుడు ఈ కారణంగానే పార్టీలో ఎమ్మెల్యేలు, మంత్రులు తీవ్ర అసహనంతో ఉన్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఏపీలో జగన్ షో నడుస్తోంది. ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి సంక్షేమ పథకాలు అమలైనా.., ప్రభుత్వం నుంచి లబ్ది చేకూరినా, అది జగన్ మాత్రమే చేశారని ప్రజలు గట్టిగా నమ్ముతున్నారు. దీనితో ప్రజలకి ఎమ్మెల్యేలు ఎంపీలతో ఏ మాత్రం సంభంధం లేకుండా పోయింది.
ఏ పథకం వచ్చినా కూడా అది జగన్ ఇచ్చిందే అని ప్రజలు భావిస్తున్నారు. అకౌంట్లో డబ్బులు పడితే చాలు జగనే వేశారని ప్రజలు చెప్పుకుంటున్నారు. ఇక దీని వల్ల ఎమ్మెల్యేలు ఎంపీలు హైలైట్ కావడం లేదు. గతంలో ప్రజాప్రతినిధులు ద్వారా పథకాలు అందేవి. కానీ ప్రజలకు నేరుగా డబ్బులు అందించడమే లక్ష్యంగా జగన్ గ్రామ సచివాలయాలని వలంటీర్లని ఏర్పాటు చేశారు.సచివాలయాల ద్వారా ప్రజలకు అన్నీ సేవలు అందుతున్నాయి. ప్రతి పథకం అందుతుంది. అటు వలంటీర్లు ప్రజలకు – సచివాలయాల మధ్య వారథిలాగా పనిచేస్తున్నారు. ఇలా జరగడం వల్ల ప్రజలకు ఎమ్మెల్యేలు ఎంపీలతో పెద్ద పని లేకుండా పోతుంది. అసలు రాష్ట్రంలో ఏం జరిగినా సరే ఆ క్రెడిట్ జగన్ కే వస్తుందిని ఎమ్మెల్యేలు ఎంపీలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారట.అయితే.. ఈ పరిణామం దీర్ఘ కాలంలో వైసీపీ కి కీడు చేసేలా కనిపిస్తోంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎక్కడైనా క్షేత్ర స్థాయిలో బలంగా ఉంటేనే ఆ పార్టీ గట్టిగా ఉన్నట్టు. ఎన్నో ఆటు పోటులను తట్టుకుని టీడీపీ ఇన్నాళ్లు రాజకీయ ప్రస్థానం సాగిస్తూ వస్తోంది అంటే ఆ పార్టీ క్యాడరే కారణం. అలాంటి క్యాడర్ కి ఐడెంటిటీ క్రైసిస్ వస్తే అది వైసీపీకి నష్టం కలిగించడం ఖాయం. గతంలో టీడీపీ కూడా జన్మభూమి కమిటీలను ఎక్కువగా నమ్ముకుని చావు దెబ్బ తింది. మరి ఇకనైనా జగన్ తన వన్ మేన్ షో కి ఫుల్ స్టాప్ పెట్టి.., ఎమ్మెల్యేలు, మంత్రులకు స్క్రీన్ స్పేస్ ఇస్తాడేమో చూడాలి.