భారతీయ పుణ్యక్షేత్రాల్లో ఒకటి తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర స్వామిని కలియుగ దైవంగా కొలుస్తుంటారు.
దక్షిణ భారతదేశంలోని కొండలపై ఉన్న తిరుమల తిరుపతి హిందూ దేవాలయాలలో ఒకటి. శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం అంటారు.. అందుకే వేల సంఖ్యలో భక్తులు స్వామిని వారిని దర్శించుకోవడం కోసం వస్తుంటారు. ఈ దేవస్థానం ఏపీ ప్రభుత్వ నియంత్రణలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఆధ్వర్యంలో అన్ని కార్యక్రమాలు నడుస్తుంటాయి. టీటీడీ చైర్మన్ ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమిస్తుంది. తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఛైర్మన్ గా తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి నియమితులయ్యారు. వివరాల్లోకి వెళితే..
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ గా కొనసాగుతూ వచ్చారు. తాజాగా ఆయన స్థానంలో టీడీటీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించబోతున్నారు వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. కాగా, వైవీ సుబ్బారెడ్డి పదవీ కాలం ఈ నెల 8న ముగియబోతుంది.. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ కొత్త చైర్మన్ ని ఎంపిక చేశారు. ఛైర్మన్ గా బాధ్యతలను స్వీకరించడం భూమన కరుణాకర్ రెడ్డికి రెండోసారి. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో 2006 నుంచి 2008 వరకు ఆయన టీటీడీ చైర్మన్ గా పనిచేశారు. ఇప్పుడు మళ్లీ జగన్ హయాంలో ఆయనకు ఈ అవకాశం లభించింది. ప్రస్తుతం భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్నారు.
ప్రస్తుతం టీటీడీలో చైర్మన్ సహా 35 మంది పాలక మండలి సభ్యులుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉత్తరాంధ్ర ఇన్ చార్జ్ గా కొనసాగున్న వైవీ సుబ్బారెడ్డి ఇక పై ఢిల్లీలో పార్టీ వ్యవహారాలను చూస్తారని టాక్ వినిపిస్తుంది. మొదటి నుంచి వైఎస్ కుంటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు భూమన కరుణాకర్ రెడ్డి. ఇక సీఎం జగన్ కి మంచి స్నేహితుడు అని అంటుంటారు. ఇదిలా ఉంటే టీటీడీ చైర్మన్ రేసులో చెవిరెడ్డి భాస్కర్, పల్నాడు జిల్లాకు చెందిన జంగా కృష్ణమూర్తి, భూమన కరుణాకర్ రెడ్డి నిలిచారు. వీరిలో సీఎం జగన్ చివరికి తిరుపతి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న భూమనను ఎంపిక చేశారు.