ఏపీలో వరుసగా నాలుగో ఏడాది వైఎస్సార్ రైతు భరోసా నిధులను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రతి పక్షనేత చంద్రబాబు నాయుడిపై తీవ్ర స్థాయిలో విరుచక పడ్డారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేశారు. నవరత్నాల పేరుతో ప్రభుత్వం అందించే పథకాలు ప్రతి ఒక్కటి ప్రజలకు అందేలా కృషి చేస్తున్నారు. అలానే ప్రజా సంక్షేమాన్ని, రాష్ట్రాభివృద్ధిని సమంగా ముందుకు తీసుకెళ్తున్నారు. అలానే జగన్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందనటంలో అతిశయోక్తి లేదు. రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు వైఎస్సార్ రైతు భరోసా అనే పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. వరుసగా నాలుగో ఏడాది కూడా వైఎస్సార్ రైతు భరోసాను అమలు చేస్తూ జగన్ సర్కార్ రైతులకు అండగా నిలుస్తోంది. మంగళవారం గుంటూరు జిల్లా తెనాలి మార్కెట్ల్ యార్డ్ లో జరిగిన కార్యక్రమంలో ఈ మూడో విడత నగదు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశారు. నాలుగో ఏడాది మూడో విడతగా 51.12 లక్షల మందికి రైతులకు రూ.1,090.76 కోట్లను సీఎం జగన్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లకు సవాల్ విసిరారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే 175 కు 175 స్థానాల్లో పోటీ చేయాలని సవాలు విసిరారు. తాము ప్రజలకు మంచి చేశాం కాబట్టే మళ్లీ గెలుస్తామన్న నమ్మకం ఉందని సీఎం జగన్ ధీమా వ్యక్తం చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో గెలవడమే తన లక్ష్యమని సీఎం జగన్ అన్నారు.
ఇంకా జగన్ మాట్లాడుతూ.. ” మీరు చూపే ప్రేమ, అభిమానానికి కృతజ్ఞతలు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుటుంది. అందుకే రైతులకు సంబంధించిన మంచి కార్యక్రమాలు చేస్తున్నాము. దాదాపు 50 లక్షలకు పైగా రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. వరుసగా నాలుగో ఏడాది మూడో విడత వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ నిధులను విడుదల చేస్తున్నాము. అంతేకాక తుపాన్ వల్ల నష్టపోయిన రైతులకు ఇన్ పుట్ సబ్సిడీగా ఏటా రూ.13,500 నగదును ఆర్థిక భరోసా అందిస్తున్నాము. ఈ నాలుగేళ్లలో ఒక్కోక్క కుటుంబానికి రూ.54 వేల చొప్పున ఆర్థిక సాయం అందించాం. అలానే ఏ సీజన్ లో పంట నష్టం జరిగితే అదే సీజన్ లో పరిహారం అందిస్తున్నాము. మాండూస్ తూఫాన్ వల్ల నష్టపోయిన 91,237 మంది రైతులకు రూ.76.9 కోట్లు అందిస్తున్నాము” అని సీఎం జగన్ తెలిపారు.
చంద్రబాబు, పవన్ కల్యాణ్ లపై సీఎం జగన్ తీవ్రస్థాయిలో విరుచకపడ్డారు. దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో 175కు 175 స్థానాల్లో పోటీ చేయాలని వారిద్దరికి సవాలు విసిరారు. చంద్రబాబు ప్రజలకు ఎప్పుడు మంచి చేయలేదు కాబట్టి అన్ని స్థానాల్లో పోటీ చేసే ధైర్యం లేదని, మీ బిడ్డకు మంచి చేశాను అనే ధైర్యం ఉంది కాబట్టే 175 కు 175 స్థానాల్లో పోటీ చేస్తున్నాడని అన్నారు. “చంద్రబాబు పాలనలో ఏటా కరువే ఉండేది. కరువుకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు. మాజీ సీఎం హయంలో ఏటా కరువు మండలాల ప్రకటనే ఉండేది.
మన ప్రభుత్వం వచ్చిన తరువాత.. నాలుగేళ్లుగా ప్రతి చెరువు, రిజర్వాయర్ నిండాయి. వ్యవసాయం దండుగా అన్న చంద్రబాబుకు మన ప్రభుత్వం మీద కడుపు మండుతోంది. కడుపు మంటకు అసూయకు అసలే మందు లేదు. చంద్రబాబుది పెత్తందార్ల పార్టీ. మనది పేదల ప్రభుత్వం, రైతన్న ప్రభుత్వం” అని సీఎం జగన్ అన్నారు. మరి.. ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.